Friday, September 22, 2023

ప్రమాదం జరిగిన మార్గంలో ‘కవచ్’ వ్యవస్థ లేదు!

- Advertisement -
- Advertisement -

మృతుల సంఖ్య తీవ్రత అందుకే పెరిగింది
 చాలా ప్రాంతాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు
మనతెలంగాణ/ హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి ఈ మార్గంలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం ప్రధాన కారణమని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని రోజులుగా ఈ వ్యవస్థను స్వదేశీ పరిజ్ఞానంతో అందుబాటులోకి తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీనిని ఏర్పాటు చేసింది. అయితే కవచ్‌ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదనీ రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ‘కవచ్’ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన మార్గంలో ఈ కవచ్ వ్యవస్థను ఇంకా తీసుకురాలేదని ఇప్పటికే రైల్వే శాఖ ఓ ప్రకటనలో ప్రకటించడం గమనార్హం.

‘కవచ్’ అంటే ఏమిటీ..? దీనివల్ల భారీ ప్రాణ నష్టం తప్పేదా?
దేశవ్యాప్తంగా కొన్ని మార్గాల్లో ‘కవచ్’ వ్యవస్థను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. శుక్రవారం ప్రమాదం జరిగిన ఈ మార్గంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. అందుకే ప్రమాద తీవ్రత పెరిగింది. కవచ్ అనేది ఒక యాంటీ కొలిజన్ సిస్టం. ఇదెలా పని చేస్తుందటే….ఒక లోకో పైలెట్ (రైలు డ్రైవర్) రెడ్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా అలాగే రైలును నడిపినప్పుడు ఈ కవచ్ సిస్టమ్ అటోమేటిగ్గా రైలును అపేస్తుంది. అదేవిధంగా రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినపుడు ప్రమాదం జరగకుండా ఈ కవచ్ కాపాడుతుంది. రెడ్ సిగ్నల్స్ పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళుతుంటే ఈ కవచ్ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు కవచ్ వ్యవస్థ గుర్తిస్తుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందించి రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుంది.

కవచ్ కోసం 2022-23లో రూ.272.30 కోట్ల కేటాయింపు
కవచ్ వ్యవస్థతో రైల్వే ఇంజన్‌లోని క్యాబిన్‌లో అమర్చిన స్క్రీన్‌పై ప్రతి సిగ్నల్ కనిపిస్తుంది. రైలు ఎంత వేగంగా కదులుతుందో లోకో పైలట్లు తమ స్క్రీన్‌పై చూడవచ్చు. దట్టమైన పొగమంచు, వర్షం, క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో రైళ్ల వేగం నెమ్మదిస్తుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట కవచ్ రైలు వేగాన్ని 30 కిలోమీటర్లకు మించకుండా ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుంది. సున్నా ప్రమాదాలే లక్ష్యంగా కవచ్‌ను అభివృద్ధి చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గతంలో ప్రకటించారు. కవచ్ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు 2021-,22 ఏడాది రూ.133 కోట్లు, 2022,-2023లో రూ.272.30 కోట్లను రైల్వే శాఖ విడుదల చేసింది.

గంటకు 127 కిలోమీటర్ల వేగంతో..
కాగా, ఖరగ్‌పూర్ డివిజన్ సిగ్నలింగ్ కంట్రోల్ రూంకు సంబంధించిన వీడియోల ప్రకారం మూడు రైళ్ల ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు ప్రధాన లైన్లు, రెండు లూప్ లైన్లతో సహా నాలుగు రైల్వే ట్రాకులు ఉన్నాయి. గంటకు 127 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన షాలిమార్, చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆ లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంది. దాని కంపార్ట్‌మెంట్‌లు మెయిన్ లైన్‌పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే ఆ మెయిన్ లైన్‌లో వస్తున్న యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 1257 మంది రిజర్వ్ ప్రయాణికులు
ప్రమాదం జరిగిన సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 1257 మంది రిజర్వ్ ప్రయాణికులు, బెంగళూరు -హావ్ ఎక్స్‌ప్రెస్‌లో 1039 మంది రిజర్వ్ ప్రయాణికులు ఉన్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అయితే వీరు కాకుండా జనరల్ బోగీల్లో ఎంతమంది ఎక్కారన్నది తెలియదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News