Thursday, July 18, 2024

డిజిటల్ సర్వేతోనే భూసమస్యలకు పరిష్కారం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం దేశంలో రోజురోజుకీ అభివృద్ధిలో ముందు ఉంటుందని చెప్పాలి, ఇక్కడ వనరులు అందుబాటులో ఉండటమే దీనికి కారణంగా చెప్పవచ్చు. అందులో ఇక్కడ ఉన్న భూములకు ఇక్కడ ఉన్న ధరలకు దేశంలో మరెక్కడా లేని విధంగా ఉంటుంది అని చెప్పాలి. రాష్ట్రంలో దూసుకుపోతున్న ప్రధాన రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి, ఒక విధంగా భూసంబంధిత సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. గత పదేళ్ల క్రితం ఉన్న ధరలు ప్రస్తుతం ఉన్న ధరలు చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇటీవల కాలంలో మనం హైదరాబాద్ శివారులో చూసాము, కొకాపేటాలో అత్యధికంగా భూమి ధర పెరగడం గురించి, సరే ఇలా భూమికి ఎనలేని ధర రావటం, మంచిదే. కానీ దానితో పాటే భూ సమస్యలు కూడా పెరుగుతున్నాయి.

ధరణీ ఏర్పాటు: గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకు వచ్చిన బృహత్తర కార్యక్రమం ధరణి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశంలో ఉన్నా మన వివరాలు ధరణిలో చూసుకోవచ్చు.అది బాగానే ఉంది. కానీ అంతక ముందు ధరణీ ఏర్పాటు చేసే నాటికి, పూర్తి సర్వే లేకుండా, పహనిలలో టైటిల్ ఉందో వారిదే భూమి అనే విధంగా ధరణిలో పెట్టారు. కానీ దీని వల్ల చాలా కేసులు నమోదయ్యాయి. వాస్తవంగా భూమిని ఎవరు చేస్తున్నారు, కాస్తులో కబ్జాలో ఎవరు ఉన్నారు సదా బైనమాలు చేసుకొని కొన్న రైతులకు టైటిల్ గ్యారెంటీ లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో డిజిటల్ సర్వే చేసి ఏళ్ల తరబడి కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులు పరిష్కరించి ఆ తరువాత ధరణినీ తీసుకోవస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు దానిని నూతన ప్రభుత్వం భూమాతగా నామకరణ చేసి ఆర్‌ఒఆర్ చట్టాన్ని సవరణ చేయాలని చూస్తున్నది. ఏదిఏమైనా పూర్తి స్థాయిలో చేస్తేనే దానికి ఒక పరిష్కారం తేగలము.

క్షేత్ర స్థాయి సర్వే చేయాలి: ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇనాం భూములు, దేవాదాయ, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు చాలా వరకు కబ్జాకు గురికావడం చాలా జరుగుతున్నాయి. ఆ భూములు పూర్తి స్థాయిలో లెక్కలు తీసి ప్రభుత్వ భూములు కాపాడాలి. ప్రస్తుతం ఉన్న భూములలో క్షేత్రస్థాయి సర్వే ప్రకారం ఎంత భూమి ఉంది, రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత ఉంది అని బహిరంగ పరచాలి. అదే విధంగా క్షేత్ర స్థాయి సర్వే వల్ల ప్రధానంగా సమస్యలు ఉన్న భూములకు ఉపయోగపడుతుంది. అదే విధంగా రాష్ట్రం లోనున్న ఏళ్ల తరబడి కోర్టులో మగ్గుతున్న భూసమస్యలకు పరిష్కారం అందుతుంది.

కౌలుదారులు: అయితే ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ రైతులు కౌలు రైతులే ఉంటారు. భూములు పెద్ద మొత్తంలో కొంత మంది దగ్గరే కేంద్రీకృతం అయి ఉంది. కౌలుదారు చట్టం ప్రకారం వాళ్లకు దక్కే అవకాశాలు హక్కులు దక్కడం లేదు. ఇటీవల కాలంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా పదిహేను వేలు రూపాయలు ఇస్తా అని చెప్పింది. కానీ వాటి లెక్కలు ఇప్పటికీ తెలియదు. అసలు రాష్ట్రంలో ఎంత మంది కౌలు రైతులు ఉన్నారో తెలియాలి. క్షేత్రస్థాయి సర్వే నిర్వహించడం ద్వారానే అదీ సాధ్యం అవుతుంది. కౌలుదారు చట్టం కూడా కఠినంగా అమలు పరిచే విధంగా విధివిధానాలు రూపొందించాలి. రైతు బంధు, రైతు బీమా అవన్నీ సేద్యం చేసేవారికీ మాత్రమే దక్కే విధంగా చూడాలి.

కాబట్టి పూర్తి స్థాయిలో డిజిటల్ సర్వే నిర్వహించడం ద్వారానే భూ సమస్యలకి పరిష్కారం అందుతుంది అని చెప్పవచ్చు.
డిజిటల్ యుగం: ప్రస్తుతం అంతా అరచేతిలో ప్రపంచం చూసే రోజులు ఇవి. ఇంత సాంకేతిక యుగంలో మనం ఉన్నాము. ఇంకా మనం పాతపద్ధతులనే పాటిస్తున్నాము. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డిజిటల్ సర్వే చేద్దాం అని అనుకున్నా చేయలేక పోయింది. ఈ ప్రభుత్వం అయినా చేసి ఉన్న సమస్యలకు చెక్‌పెట్టే విధంగా చూడాలి. కాబట్టి వెంటనే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచన చేసి భూ సమస్యలకి పరిష్కారం తేవాలి అని కోరుకుందాం…!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News