Home జిల్లాలు అదృశ్యం

అదృశ్యం

hydనగరంలో జాడలేని హెరిటేజ్ కన్జర్వేషన్
కమిటీ
1981లో ఆవిర్భావం… 2012లో చివరి
సమావేశం
కమిటీలో 8 మంది సభ్యులు
జరిగిన సమావేశాలు 116
నగరంలో వారసత్వ సంపదలు 146
శిథిలావస్థకు చేరుతున్న చారిత్రక
కట్టడాలు
పట్టింపులేని హెచ్‌ఎండిఎ

సిటీబ్యూరో:400 ఏళ్ళకు పైబడిన చరిత్ర ఉన్న పురాతన నగరం… 140కి పైగా చారిత్రక కట్టడాలను కలిగిన మహా నగరం… 3 లక్షలకు పైగా విదేశీ పర్యాటకులు సంద ర్శిస్తున్న విశ్వనగరం… ఇప్పుడు వారసత్వ సంపదల పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వని నగరం. ఇదీ ఇప్పటి హైదరాబాద్ పరిస్థితి. వందల ఏళ్ళనాటి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే, తెలిపే నిలువెత్తు సాక్షా లను, నిదర్శనాలను అందిస్తున్న విశ్వనగరంలో వార సత్వ సంపదలను పర్యవేక్షించేందుకు, పరిరక్షిం చేందుకు ఏర్పడిన కమిటీ కాస్త అటకెక్కింది. ఇంతకీ ఆ కమిటీ ఉన్నదో…లేదో…? తెలియని పరిస్థితి. 1981 లో అప్పటి ప్రభుత్వం చారిత్రక ప్రాధాన్యత గల పురాతన భవనాలను పరిరక్షించడం కోసం వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ(హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ) ని ఏర్పాటు చేసింది. అనంతరం ప్రభుత్వం ఈ కమిటీ ని 2006లో పునర్నిర్మాణం చేసింది. ఈ కమిటీలో ప్రముఖ పౌరులు, పురావస్తు నిపుణులు, ఇంజినీర్లు, చరిత్రకారులు, పర్యావరణవేత్తలు ఉంటారు. 8 మంది సభ్యులు కలిగిన ఈ కమిటీకి హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) కమిషనర్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. కమిటీ సమావేశాలను హెచ్‌ఎండిఎనిర్వహిస్తుంది. హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌లో 116 మార్లు హెరిటేజ్ కమిటీ సమావేశమైనట్టు, 2012, జనవరి 17న పదవీ విరమణ చేసిన ఐఏఎస్ రాజమణి చైర్మన్‌గా వ్యవహరించగా 116 సమావేశమైనట్టు ఉన్నది. అనంతరం గత నాలుగేళ్ళుగా ఈ కమిటీ సమావేశం కావడంలేదా..? లేక సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరచడం లేదా..? అని అడిగితే అథారిటీ అధికార వర్గాలు మాత్రం జరగడంలేదనే సమాచారాన్నిస్తున్నారు.
ఇదీ హెరిటేజ్ కమిటీ…
2012లో జరిగిన 116వ సమావేశానికి చైర్మన్‌గా రాజమణి, ప్రత్యేకాహ్వానితులుగా హెచ్‌ఎండీఏ కమిషనర్ రాజేశ్వర్ తివారి, సభ్యులుగా సంజయ్ తోర్వి, సజ్జద్ షాహిద్, ఫారూఖి ఖాదర్, రమేష్ కామజోష్యుల, నారాయణ(ఎక్స్ అఫిషియో), బిడే(కోఆప్షన్), విశ్వనాథన్, రమేష్‌లు సభ్యులుగా ఉన్నారు.
కమిటీ ఉద్దేశ్యం…
నగరంలోని చారిత్రక కట్టడాలను, నిదర్శనాలను పరిరక్షించడం. వాటి కోసం కార్యాచరణ చేపట్టడం. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు, తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తుజాగ్రత్తలను వివరించాలి.
2012 నుండి కనిపించని కమిటీ…
హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటి ప్రతి మూడేళ్ళకొకమారు పునర్నియామకం కావాలి. కానీ, 2012 నుండి కమిటీని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. నగరంలోని వారసత్వ సంపదల విషయం కాస్త జఠిలమవుతుండటంతో ప్రభుత్వం కటిమి నియామకంపై మౌనంగా ఉంటూ వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్‌ఎండీఏ కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తోంది. నాలుగేళ్ళు గడిచిపోతున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచినా చారిత్రక కట్టడాలపై దృష్టిపడలేదనే చర్చ జరుగుతుంది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరానికి ఏటా 3 లక్షలకుపైగా విదేశీ పర్యాటకులు వస్తున్నారు. ప్రభుత్వం కూడా పర్యాటక రంగానికి ప్రాధాన్యతనిస్తుందనే ప్రచారం జరుగుతుంది. కానీ, పర్యాటకులను అమితంగా ఆకర్షించే పురాతన నిర్మాణాలపై శ్రద్దచూపకపోవడంపై ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.
20 చారిత్రక నిర్మాణాలు శిథిలావస్థలో…
నగరంలో దాదాపు 146 చారిత్రక పురాతన నిర్మాణాలు, శిలలు, కోటలు ఉన్నాయి. ఇందులో 15 శాతం వరకు వారసత్వ సంపదలు శిథిలావస్థకు చేరినట్టు సమాచారం. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఇరం మంజిల్, మోజాం జాహి మార్కెట్, ఓల్డ్ జైల్ కాంప్లెక్స్(మోండా మార్కెట్), అలియాబాద్ సరాయి వంటివి శిథిలావస్థకు చేరిన వాటిలో ప్రధానంగా ఉన్నాయని చరిత్రకారులు పేర్కొంటున్నారు. వీటిని పట్టించుకోని పక్షంలో చరిత్ర భవిష్యత్ తరాలకు అందించే అవకాశాలు కనుమరుగవుతాయి. మరి ప్రభుత్వం లేదా హెచ్‌ఎండీఏ వారసత్వ సంపద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ నగర చరిత్రకారుల్లో, పదవీ విరమణ పొందిన ఉన్నతస్థాయి ఇంజనీర్లలో వినిపిస్తుంది.