అమరావతి: పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి అని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని అన్నారు. తాడేపల్లి పార్టీ యువజన విభాగం నేతలతో జగన్ భేటీ అయ్యారు. పార్టీలో యూత్ వింగ్ క్రియాశీలకం అని.. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశమని, పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్ళే అని తెలియజేశారు. పార్టీ పెట్టిన కొత్తలో తాను, తన అమ్మ మాత్రమే ఉన్నాం అని, తన మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు తనతో వచ్చారు అని అన్నారు. తన ప్రస్థానం అక్కడ నుంచి మొదలయ్యింది అని ఎన్ని కష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు.
రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీపడలేదని, ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ తమకు వచ్చిందని చెప్పారు. ‘‘ పార్లమెంట్ లో ప్రతి సభ్యుడూ (Every member Parliament) మన వైపే చూసే పరిస్థితి అని దాన్ని జీర్ణించుకోలేక మన మీద పగబట్టారు’’ అని ఆవేదనను వ్యక్తం చేశారు. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే రాజీనామా చేయించానని, ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాం అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉపఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయని, 2014లో 67 మందితో గెలిచాం అని అన్నారు. మళ్లీ మన దగ్గర నుంచి 23 మందిని లాక్కున్నారని విమర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉండటమనేది చాలా ముఖ్యం అని చెప్పారు. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలి అని మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యం అని తెలిపారు. ఇవి చేయగలిగితే.. లీడర్ గా ఎదుగుతారు అని జగన్ స్పష్టం చేశారు.