Friday, January 27, 2023

సంపాదకీయం: ఉచితాలపై ఇసి ఉరుము

- Advertisement -

The rate of increase in unemployment reached 7.6 percent ఎన్నికలలో ప్రజలకు పార్టీలు వాగ్దానం చేసే ఉచితాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ విషయంలో పార్టీలను గట్టిగా అదుపు చేసేందుకు వీలుగా ఎన్నికల నియమావళిని సవరించాలని సంకల్పించింది. పార్టీలు తాము వాగ్దానం చేసే ఉచితాల కింద అయ్యే నిధులను అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచి తెస్తాయి మున్నగు విషయాలను వివరంగా మేనిఫెస్టోల్లో చేర్చాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనిపై ఈ నెల 19 లోగా పార్టీలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని లేని పక్షంలో వారు అంగీకారం తెలిపినట్లే భావించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. ఇందుకు పూర్వరంగంలో చాలా జరిగింది. ఈ విషయాన్ని ముందుగా ప్రధాని నరేంద్ర మోడీయే ప్రస్తావించారు.

రేవ్‌డి (ఉచితాలు లేదా తాయిలాలు) సంస్కృతికి అలవాటు పడిన వారు ఉచిత తాయిలాలు పంచడం ద్వారా ప్రజలను సులభంగా కొనుగోలు చేయవచ్చుననే ధీమాలో వుంటున్నారని, అందరం కలిసి ఈ ఉచితాల పద్ధతిని నిర్మూలించాలని, దేశ రాజకీయాల్లో వాటికి తావు లేకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ గత జులైలో బుండేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవ సభలో అన్నారు. తాయిలాలు పంచడం ద్వారా ఓట్లను కొల్లగొట్టాలనుకోడం చాలా ప్రమాదకరమైన పద్ధతి అని యువతరం దీని పట్ల జాగ్రత్తగా వుండాలని ఆయన ఆ సభలో బాహాటంగా హెచ్చరించారు. ఇది జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయంలో స్వయంగా ఉత్సాహం చూపించి జోక్యం చేసుకున్నది. ఏ ఒక్క పార్టీ వ్యతిరేకం కానందున ఎన్నికల్లో ‘అహేతుకమైన ఉచితాల’ పంపిణీని అరికట్టే విషయంలో పార్లమెంటులో గట్టి చర్చ జరిగే అవకాశం లేదని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఆగస్టులో అభిప్రాయపడింది.

ఈ సమస్యపై నిష్పాక్షికంగా పరిశీలన చేయగల వ్యక్తులతో ఒక ప్రత్యేక కమిటీని నియమించవలసిన అవసరముందని భావించింది. ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఓటర్లకు ఉచితాలను వాగ్దానం చేసే పద్ధతిని నిషేధించాలనే ధోరణిలో మాట్లాడారు. ఉచితాల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎనలేని ముప్పు వాటిల్లుతుందని, అవి ఓటర్ల తీర్పును ప్రభావితం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలనకు పంపాలని ప్రభుత్వం తరపున సూచన రాగా ఇసిని ఈ వ్యవహారం నుంచి దూరంగా వుంచాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ, ఆర్థిక సమస్య అని కేవలం ఎన్నికలకు సంబంధించింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే విషయంలో ఎన్నికల సంఘం ముందుకు రావడం గమనించవలసిన విషయం. సుప్రీంకోర్టు సుబ్రమణియన్ బాలాజీ x తమిళనాడు ప్రభుత్వం కేసులో తీర్పు ఇస్తూ పార్టీలు ఎన్నికల ప్రణాళికలలో ఉచితాలను వాగ్దానం చేయడాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద అవినీతి చర్యలుగా, ప్రజలకు ఇచ్చే లంచాలుగా భావించడానికి ఎంత మాత్రం వీలు లేదని పేర్కొన్నది.

వాటిని అరికట్టే చట్టమేదీ లేని నేపథ్యంలో గుర్తింపు పొందిన పార్టీలతో ఎన్నికల సంఘం మాట్లాడి మేనిఫెస్టోలలో ఉచితాలను వాగ్దానం చేసేటప్పుడు పాటించవలసిన పరిమితులను ప్రవర్తనా నియమావళిలో చేర్చవచ్చునని సూచించింది. ఇప్పుడు ఎన్నికల సంఘం దీనిని ఆసరా చేసుకొని ఉచితాలపై పార్టీలను కట్టడి చేసేందుకు సంకల్పించింది. కపిల్ సిబల్ వాదించినట్టు ఉచితాలనేవి ఎన్నికలకు పరిమితమైనవి కావు. అవి ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంబంధించినవి. వారు ఎన్నుకునే ప్రతినిధులతో కూడిన ప్రభుత్వాలుగా వారికి ఏమి చేయదలచినట్టో చెప్పుకునే బాధ్యత, స్వేచ్ఛ పార్టీలకు వుంటుంది. ఎన్నికల్లో పార్టీలు వాగ్దానం చేసే సంక్షేమ పథకాలు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమలు బాధ్యత కిందికి కూడా వస్తాయని సుప్రీంకోర్టు సుబ్రమణియన్ బాలాజీ కేసులో పేర్కొన్నది.

రాజ్యాంగం 14వ అధికరణ ప్రజలకు ప్రసాదిస్తున్న హక్కు కింద కూడా వీటిని పరిగణించవలసి వుంటుందని అభిప్రాయపడింది. సూక్ష్మంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అతి సన్నిహితంగా వుంటాయి. వారి కష్ట సుఖాలెరిగి పరిపాలించవలసిన బాధ్యత వాటి మీద ఇనుమిక్కిలిగా వుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ అనుచితాలు అనుకుంటున్న ఉచితాల అవసరం రాష్ట్ర పాలకులకు తెలిసినంతగా కేంద్ర పాలకులకు తెలియదు. వారెప్పుడూ దేశంలోని అత్యంత సంపన్నులకు, కార్పొరేట్లకు ఏమి మేలు చేయాలి, వారిని ఇంకెంతగా మేపాలి అనే ఆలోచిస్తూ వుంటారు. అందుచేతనే తెలంగాణలో ఉచితంగా ఇస్తున్న సాగు విద్యుత్తుకు మీటర్లు పెట్టి ప్రైవేటు విద్యుత్తు వ్యాపారులు రైతుల గోళ్లూడగొట్టి బిల్లులను వసూలు చేసేలా చూడాలని ప్రధాని మోడీ ప్రభుత్వం ఆరాటపడుతున్నది. ఎన్నికల సంఘం ద్వారా ఉచితాలకు అంటకత్తెర వేయించాలనే ఆలోచన ఎంత మాత్రం సముచితం కాదు. అది ఆచరణలో ఫలించే అవకాశమూ లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles