Saturday, April 27, 2024

ఐఎఎస్, ఐపిఎస్‌లపై ఇసి వేటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని పకడ్భందీగా అమలు చేసే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను, ఉన్నతాధికారులపై కొరడా ఝళిపించింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి. నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, వరంగల్ సిపి రంగనాథ్, నిజామాబాద్ సిపి వి.సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టికె శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీతో పాటు తొమ్మిది జిల్లాల నాన్ కేడర్ ఎస్పీల బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఇసి ఆదేశాల్లో పేర్కొంది. గురువారం సాయంత్రం 5 గంటల కల్లా ప్యానల్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇసి ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం అసంతృప్తితోనే..
ఈ నెల 3వ తేదీ నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షించారు. పోలీసు శాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఇసి అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్‌పి స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎస్సీలకు స్థానచలనం కల్పిస్తూ ఇసి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు పలువురి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించాయి. రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం కమిషన్‌కు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోపణలు వచ్చిన వారిపై ఇసి బదిలీ వేటు వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News