Sunday, December 15, 2024

మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్..నోటీసులిచ్చిన ఇడి

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మల్లారెడ్డికి ఇడి షాకిచ్చింది. పిజి మెడికల్ సీట్ల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం మల్లారెడ్డికి నోటీసులు అందజేశారు. గత సంవత్సరం జూన్‌లో మల్లారెడ్డికి చెందిన 12 మెడికల్ కళాశాలల్లో అధికారులు దాడులు చేశారు. ఇడి సోదాల్లో కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పిజి మెడికల్ సీట్లు ఇల్లీగల్ గా బ్లాక్ చేసినట్లు గుర్తించారు. తెలంగాణలోని 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 45 సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఇడి తేల్చింది. ఇందుకు సంబంధించి అధికారులు మల్లారెడ్డిని వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రెండు రోజుల పాటు ఇడి సోదాలు నిర్వహించింది. లెక్కలు చూపని కోటి 40 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.కాలేజీకి సంబంధించిన అకౌంట్లలో రెండు కోట్ల 89 లక్షలు నగదు కూడా సీజ్ చేసింది. 2022 ఏప్రిల్‌లో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పిజి సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి అమ్ముకున్నారని

మెడికల్ యూనివర్సిటీ అధికారులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఇడి రంగంలోకి దాడులు చేసింది. అప్పుడు సోదాల్లో లభించిన పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ అన్నింటిని విశ్లేషించిన ఇడి అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. 2022 నవంబర్‌లో ఐటి అధికారులు మల్లారెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. మల్లారెడ్డికి సంబం ధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో దాడులు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. ఆయన కూతురు, కొడుకు, అల్లుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో దాడులు నిర్వహించారు. మల్లారెడ్డికి మెడికల్ కాలేజీలే కాకుండా ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఆయన విద్యాసంస్థలు స్థాపించి భారీగా సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి చెరువులను ఆక్రమించినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. నోటీసులపై మల్లారెడ్డి ఎలా స్పందిస్తారో? చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News