Wednesday, April 24, 2024

నేడు మళ్లీ విచారణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత రెండోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణ ముగిసింది. సోమవారం దాదాపు పదిన్నర గంటల పాటు కవితను విచారించింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు పిడికిలి బిగించి అభిమానులకు అభివాదం చేస్తూ ఇడి కార్యాలయం లోపలికి వెళ్లిన కవిత పది గంటల తర్వాత రాత్రి 9.14 గంటల సమయంలో బయటికొచ్చారు. 9.25 గంటలకు ఢిల్లీలోని సిఎం కెసిఆర్ నివాసానికి చేరుకుని తన కోసం వేచి చూస్తున్న నాయకులు, కార్యకర్తలకు విజయచిహ్నం చూపిస్తూ లోనికి వెళ్లారు. ఉదయం ఇడి ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఎంత ధీమా, ధైర్యంతో వెళ్లారో.. అదే స్థైర్యంతో చెరగని చిరునవ్వుతో ఇంటికి చేరుకున్నారు. ఆమె బయటికి వచ్చేదాక తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొన్నది. అయితే సోమవారం సుదీర్ఘంగా కవితను విచారించిన ఇడి అధికారులు మంగళవారం మరోసారి విచారణకు రావాలని సూచించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కవితకు చెప్పినట్లు సమాచారం. కాగా, సోమవారం ఉదయం 10.30 గంటలకే ఢిల్లీలోని సిఎం కెసిఆర్ నివాసం నుంచి కవిత ఇడి కార్యాలయానికి వెళ్లారు.

ఆమె వెంట ఇడి కార్యలయానికి భర్త అనిల్, న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్లారు. పిఎంఎల్‌ఎ సెక్షన్ 50 కింద ఇడి అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. దిల్లీ, హైదరాబాద్ సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఇడి అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసులో అనుమానితురాలిగా కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలక వ్యక్తిగా ఇడి పేర్కొంది. బ్యాంక్ స్టేట్‌మెంట్ సహా మిగిలిన డాక్యుమెంట్లను కవిత వారికి అందించారు. మొదటి అరగంటపాటు వివరాలు నమోదు, సంతకాలు తీసుకున్నాక సరిగ్గా 11 గంటలకు ఇడి అధికారుల ఎదుట కవిత హాజరయ్యారు. దాదాపు పదిన్నర గంటలకు పైగా కవితను ఇడి అధికారులు విచారించారు. మొత్తం 20 ప్రశ్నలు కవితకు సంధించినట్లు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్ గ్రూప్‌లో ఉన్న వ్యక్తులతో కవితకు సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి ఇడి అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో విచారణలో భాగంగా తమ కస్టడీలో ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి ఇడి అధికారులు కవితను విచారించారు.

రెండు గంటలకు పైగా కవితను, అరుణ్ రామచంద్ర పిళ్లైని కన్‌ఫ్రంటేషన్ పద్ధతిలో ఇడి అధికారులు విచారించినట్టుగా తెలుస్తోంది. కవితకు బినామీ అని అరుణ్ రామచంద్ర పిళ్లై చెప్పారని పేర్కొన్న ఇడి అందుకు సంబంధించిన ప్రశ్నలపై సమాధానాలు రాబట్టేందుకు యత్నించినట్టుగా తెలుస్తోంది. సాయంత్రం సమయంలో కవితను ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిపి ప్రశ్నించినట్లు సమాచారం. ఐదుగురు అధికారులు బృందం కవితను విచారిస్తోందని, అందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారని సమాచారం. విచారణ సందర్భంగా కవిత వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్ర, కవిత ప్రమేయం, ఆధారాల ధ్వంసం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదని కవిత చెప్పినట్లు తెలుస్తోంది. కాగా సాయంత్రం సమయంలో తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు ఇడి కార్యాలయానికి వెళ్లారు.

ఇడి ఆఫీస్ ఎదుట భర్తతో..

సోమవారం భర్త అనిల్‌తో కలిసి ఇడి కార్యాలయం వద్దకు చేరుకున్న కవిత కాస్త భావోద్వేగానికి గురయ్యారు. కారు దిగగానే భర్తను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కవిత ఒక్కరే ఇడి కార్యాలయంలోకి వెళ్లగా అనిల్ తో సహా ఆమె వెంట వచ్చినవారంతా బయటే వుండిపోయారు.

నేడు ఇడి విచారణకు వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ఎపి వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఇడి విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఇడి అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఈనెల 18న ఇడి విచారణకు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరు అయ్యారు. బంధువులకు అనారోగ్యంతో విచారణకు హాజరు కాలేకపోయారన్న సంగతి విదితమే. కాగా ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవ రెడ్డిని ఇడి అధికారులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News