Thursday, April 25, 2024

యుపిలో ‘మజ్లిస్’ ఎవరికి ప్లస్?

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి- మార్చిలో జరగబోయే విధానసభ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాలకు పోటీ చేస్తామని ఎంఐఎం నేత అసద్ ఈ మధ్య ప్రకటించారు. దీంతో అందరికన్నా ఎక్కువగా యుపిలోని ముస్లిం మేధావి వర్గం ఉలిక్కిపడింది. పచ్చి హిందుత్వవాది అయిన యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్ లోని ముస్లింలు, మైనారిటీలు, దళిత వర్గాలు ఇబ్బందుల పాలైనట్లు ఎన్నో ఉదంతాలు వార్తల్లో వచ్చాయి. తద్వారా స్థానిక ముస్లిం ఆలోచనాపరులు రాష్ట్రంలో బిజెపి పాలనను కోరుకోవడం లేదని చెప్పవచ్చు.

దేశ రాజకీయ దిశను మార్చే శక్తి ఒక చిన్న రాజకీయ పార్టీకి ఉందా అంటే ఔననే జవాబు వచ్చే పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెలల్లో జరగబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, దాని ఫలితాలు 2024లో కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వాన్నినిర్ణయిస్తామని సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే యుపిలో పార్టీల గెలుపోటములపై మన హైదరాబాద్ పాతనగర పార్టీ అయిన మజ్లిస్ నిర్ణాయక శక్తిగా మారబోతోందన్న వార్తలు కొందరికి ఆందోళన కలిగిస్తున్నాయి.
2014 నుండి ఈ పార్టీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజక వర్గాల్లో పోటీ చేస్తూ సాధించిన విజయాల కన్నా ముస్లిం ఓట్లను చీల్చి ఫలితాలను తారుమారు చేసినా సందర్భాలే అధికంగా ఉన్నాయి. దాని ప్రమేయం బిజెపికి ఊహించని విజయాల్ని తెచ్చిపెట్టింది. దీంతో మజ్లిస్ పార్టీకి బిజెపి – సి పార్టీగా, కాంగ్రెస్ ఓట్లు చీల్చే కత్తి పార్టీగా పేరు పడింది. ఎంఐఎం (మజ్లిస్) మా ఓట్లకు కత్తెర అని రాహుల్ గాంధీ బాహాటంగా అన్నారు. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసిని బిజెపి ఏజెంట్ అంటాడు. లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కూడా ఎంఐఎం కొన్ని ఉత్తరాది రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పరోక్షంగా బిజెపి గెలుపుకు సహకరిస్తోందని అంటున్నాడు.
‘2020 బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం బిజెపికి సాయపడింది, రాబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ దాని సహకారం మాకుంటుందని’ బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అయితే కాంగ్రెస్ నేతల కడుపు మండడానికి తగిన కారణాలు ఉన్నాయి. 2019లో మహారాష్ట్రలో, 2020లో బీహార్‌లో కాంగ్రెస్ విజయావకాశాలను ఎంఐఎం గండి కొట్టిందనడానికి లెక్కలున్నాయి. వాస్తవానికి 2014 ఎన్నికల్లో కన్నా తర్వాతి 2019 ఎన్నికల్లో బిజెపి 17, శివసేన 7 స్థానాలను కోల్పోయి ఎన్‌సిపి 13 సీట్లు పుంజుకుంది. కాంగ్రెస్‌కు కూడా 2 సీట్లు పెరిగాయి. ఇది మంచి సంకేతమే. అయితే 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఏకంగా 44 సీట్లకు పోటీ చేసి కేవలం 2 స్థానాలు గెలిచి మిగితా చోట్ల కాంగ్రెస్ గెలుపు అవకాశాల్ని తుడిచేసింది. ముస్లిం ఓట్ల చీలికతో కాంగ్రెస్ ఓ సదవకాశాన్ని కోల్పోయినట్లయింది.
ప్రజలు వద్దనుకున్న శివసేన ఏకంగా పీఠాన్ని అందుకుంది. కాంగ్రెస్‌తో జతకట్టవలసిన ఎన్‌సిపి అయిష్టంగా శివసేనతో కాపురం చేయవలసి వచ్చింది. 2020లో బీహార్ శాసనసభ ఎన్నికల్లోనూ అదే పునరావృతమైంది. అక్కడ కాంగ్రెస్‌కు పట్టున్న సీమాంచల్ ప్రాంతంలో 24 స్థానాల్లో మజ్లిస్ పోటీ చేసి 5 స్థానాలు గెలిచింది. ఓట్ల చీలిక వల్ల ఆర్‌జెడి కాంగ్రెస్ కూటమికి రావలసిన మిగితా సీట్లు బిజెపి ఖాతాలోకి వెళ్లిపోయాయి. దాంతో గత ఎన్నికల్లో కన్నా బిజెపి 21 స్థానాలు ఎక్కువచ్చాయి. కాంగ్రెస్ కుదేలు కావడంతో అసెంబ్లీలో 75 స్థానాలు గెలిచిన ఆర్‌జెడి కి బదులు 43 స్థానాలకే పరిమితమైన నితీష్ కుమార్ బిజెపి సాయంతో ముఖ్యమంత్రి కాగలిగారు. ఎంఐఎం ‘మా ఓట్లకు కత్తెర’ అని రాహుల్ గాంధీ అన్నది ఈ సందర్భంలోనే.
ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి- మార్చిలో జరగబోయే విధానసభ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాలకు పోటీ చేస్తామని ఎంఐఎం నేత అసద్ ఈ మధ్య ప్రకటించారు. దీంతో అందరికన్నా ఎక్కువగా యుపిలోని ముస్లిం మేధావి వర్గం ఉలిక్కిపడింది. పచ్చి హిందుత్వవాది అయిన యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్ లోని ముస్లింలు, మైనారిటీలు, దళిత వర్గాలు ఇబ్బందుల పాలైనట్లు ఎన్నో ఉదంతాలు వార్తల్లో వచ్చాయి. తద్వారా స్థానిక ముస్లిం ఆలోచనాపరులు రాష్ట్రంలో బిజెపి పాలనను కోరుకోవడం లేదని చెప్పవచ్చు.
రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణ కోసం ఏడాది పాటు ఢిల్లీలో పడరాని తిప్పలు పడ్డ యుపి రైతాంగం బిజెపిపై కోపంగా ఉంది. గతంలో 300 సీట్లు గెలిచిన బిజెపి ఈసారి 250 సీట్లు గెలిచి తమ పాలనను నిలబెట్టుకుంటుందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. గతంలో కేవలం 69 సీట్లకే పరిమితమైన సమాజ్ వాది పార్టీ మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉందా అనేది అసలైన ప్రశ్న. ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఎస్‌పి ఎంతకైనా పుంజుకోవచ్చనేలానే ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతగట్టి తాము దెబ్బ తిన్నామని భావించిన ఎస్‌పి నేత అఖిలేష్ యాదవ్ ఈసారి ఒంటరిపోరుకు సిద్ధపడ్డారు. క్షత్రియుడైన యోగి పాలనలో బ్రాహ్మణుల ప్రాబల్యాన్ని తగ్గిస్తున్నాడని వారు ఆయనపై గుర్రుగా ఉన్నారు.
ఢిల్లీ రేపటి పాలనకు యుపి అసెంబ్లీ విజయం తొలిమెట్టుగా భావిస్తున్న ప్రధాని మోడీ ఇందుకోసం సకల ప్రయత్నాలు చేస్తున్నారు. జారిపోతున్న ప్రతిష్ఠను ఎలాగైనా కాపాడాలని అయోధ్యకు కాశీని జోడించారు. హిందూ ఓట్లు అన్ని బిజెపి ఖాతాలో పడాలని సకల విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఈ దశలో యుపిలో మజ్లిస్ వంద సీట్ల పోటీ ప్రకటన చూసి ఇది ఎవరికీ మేలు చేస్తుందని అక్కడి ముస్లిం విద్యావంతులు బెంగ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ జనాభాలో 20% ముస్లింలున్నారు. వారి ఓట్లు అధికంగా ఉండి ఎంఐఎం గెలుపు ఖాయం అనుకున్న చోట అది పోటీ చేస్తే సరిపోతుందని, గతంలో 38 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు గెలువని పరిస్థితుల్లో వంద సీట్లకు పోటీ చేస్తే ప్రయోజనం ఉల్టా అవుతుందని అక్కడి ముస్లిం పెద్దలు వాపోతున్నారు.
అసద్ ఏకపక్ష ప్రసంగాలు ముస్లిం యువతను ప్రభావితం చేసి మజ్లిస్ అభ్యర్థికి ఓటు వేసేలా చేసినా ఓట్ల చీలికతో ఫలితం బిజెపికి పరోక్ష సాయమే అవుతుందని వారి అభిప్రాయం. దేశంలోని ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో తమ జాతి గొంతు వినిపించాలని అసద్ ఆశించడాన్ని ఎవరు తప్పుపట్టరు కాని ఆ దిశగా వేసే ప్రతి అడుగు ముస్లింలకు మేలు జరిగేలా ఉండాలని అందరు కోరుకుంటున్నారు. హైదరాబాద్‌లో పుట్టిన చిన్న పార్టీని దేశంలోని ముస్లిం జనాభాకు ప్రాతినిధ్యం వహించేలా జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత అసదుద్దీన్ ఓవైసీకే దక్కుతుంది. అయితే ఇప్పటికే ఆయనపై బిజెపి విజయాలకు లోపాయ సహకారి అని ముద్ర పడింది. దాన్ని తుడుచేసుకోవడానికైనా ఆయన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ముస్లిం పెద్దల అభిప్రాయాలను, ముస్లిం ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి.
తెలంగాణలో ఎంఐఎం తెరాసతో ఎలాంటి పరస్పర సహకార ధోరణి అవలంబిస్తుందో అందరికి తెలిసిందే. ఆ బంధం వల్ల రాష్ట్రంలోని ముస్లింలకు ప్రభుత్వ తోడ్పాటు లభిస్తోంది. ఈ విధానమే యుపిలోను, మరే ఇతర ప్రాబల్య రాష్ట్రాల్లో అవలంభించవచ్చు. దాని వల్ల ఆ పార్టీ గెలిచినంతలో తమ వారికి ప్రయోజనం చేకూరే ప్రయత్నాలు చేయవచ్చు. ముస్లింలను కాంగ్రెస్, ఇతర ప్రధాన పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి తప్ప తమకెలాంటి లాభం చేయలేదని పదే పదే అనే అసద్ అంతిమంగా వాటిపై కోపంతో తన చర్యల ద్వారా ఎవరికి పాలన అప్పగిస్తున్నాడో దాని వల్ల తాను నాయకుడని చెప్పుకుంటున్న జాతికి జరుగుతున్న లాభాలు, నష్టాల గురించి ఆలోచించాలి. అంతిమంగా దేశ ప్రజల బాగోగులే ఎవరికైనా ప్రధానం.

బి.నర్సన్, 9440128169

Editorial about UP Elections 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News