Wednesday, April 17, 2024

ప్రధాని మోడీ విధాన తడబాటు

- Advertisement -
- Advertisement -

Editorial on PM Modi withdraw Farm Laws

పార్టీ వ్యవహారాల్లో మినహా అధికార రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి పుష్కర కాలం పాటు తిరుగులేని ఆధిపత్యం వహించిన తర్వాత, నేరుగా ప్రధాన మంత్రిగా ఏడేళ్లకు పైగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ అధికార రాజకీయాల్లో రెండు దశాబ్దాల కాలం అనుభవం గడించారు. ఆయన పదవులు చేపట్టే వరకు ఏనాడు రాష్ట్ర శాసనసభ, పార్లమెంట్, సచివాలయాలు సందర్చించిన సందర్భాలే లేవు. అయినప్పటికీ విశ్వాస పాత్రులైన కొద్ది మంది అధికారుల సహకారంతో ఎన్ని విమర్శలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ వచ్చారు. అత్యంత వివాదాస్పదమైన, సంక్లిష్టమైన అంశాలలో సహితం ధైర్యంగా అడుగులు వేశారు.
బహుశా ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా అంతటి విమర్శలకు, విద్వేషపూరిత ప్రచారాలకు మరెవ్వరూ గురికాలేదని చెప్పవచ్చు. ఎన్నో ప్రతికూల సందర్భాలను సహితం ధైర్యంగా ఎదుర్కొన్న మోడీ బహుశా మొదటిసారిగా ఇప్పుడు తడబడుతున్నట్లు కనిపిస్తున్నది. విధానపరమైన అంశాలపై నిలకడగా వ్యవహరింప లేకపోతున్నారనే అనుమానాలు పలు వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్‌లో, సొంత పార్టీలో, మంత్రివర్గంలో కీలక అంశాలపై నిర్మోహమాటంగా చర్చలకు సిద్ధపడటం లేదు. అటువంటి ధోరణి ఇప్పటి వరకు ఆయన బలంగా కనిపించగా, ప్రస్తుతం అదే బలహీనతంగా వ్యక్తం అవుతున్నది. తిరుగులేని నాయకుడిగా ఎదిగినా, ఒక బృందం నేతగా వ్యవహరింపలేకపోతున్నట్లు పలువురు భావిస్తున్నారు.
మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేస్తూ పార్లమెంట్ బిల్లు ఆమోదించడం ఒక విధంగా ఆయన నాయకత్వానికి సవాల్ అని చెప్పవచ్చు. ఈ మధ్యనే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఏ విషయంపై అయినా అందరితో అమరికలు లేకుండా చర్చించడం ప్రధాన అంశం. కానీ ప్రధాని ఏ ఒక్క అంశంపై కూడా అటువంటి చర్చకు అవకాశం ఇవ్వడం లేదు. అంటే తాను తీసుకొంటున్న నిర్ణయాలపై ఆయనకే విశ్వాసం లేదా? సవివరమైన చర్చ జరిగితే తన వాదన బలహీనపడుతుందని భయపడుతున్నారా?
వాస్తవానికి వ్యవసాయ సంరక్షణల కోసం గత నాలుగు దశాబ్దాలుగా దేశంలో వివిధ ప్రాంతాలలో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల చట్టంను రద్దు చేయాలని, మార్కెట్ కమిటీలలో దళారుల ప్రాబల్యాన్ని కట్టడి చేయాలని, తమ ఊడిపట్టులను ఎక్కడైనా అమ్ముకొనే స్వేచ్ఛ తమకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 1991లో తీసుకు వచ్చిన ఆర్ధిక సంస్కరణలు వ్యాపార, పారిశ్రామిక రంగాలకు పరిమితం కావడంతో అవి దేశంలో సంపద పెరగడానికి, భారత్ ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా పెరగడానికి సహకరించాయి. కానీ గ్రామీణ, వ్యవసాయ రంగాలలో సంస్కరణలు చేయలేకపోవడంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం లేదు.
2003లో వాజపేయి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్రయత్నాలకు కొనసాగింపుగా యుపిఎ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి శరద్ పవార్ విస్తృతమైన సమాలోచనలు జరిపారు. ఒక మాదిరి వ్యవసాయ మార్కెటింగ్ చట్టం కూడా తీసుకొచ్చారు. ఆ ప్రయత్నాల కొనసాగింపుగా వ్యవసాయ సంస్కరణలు తీసుకు రావడానికి మోడీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది. అయితే ఆయన వ్యవసాయం ప్రాథమికంగా రాష్ట్రాల అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలతో, రైతు నాయకులతో విస్తృతంగా చర్చలు జరిపి ఉంటె, పార్లమెంట్‌లో సవివరంగా చర్చలు జరిపి ఉంటే లోపరహితంగా చట్టాలు అందరి ఆమోదంతో తీసుకు వచ్చే అవకాశం లభించి ఉండెడిది.
నేడు వ్యవసాయ సంస్కరణలకు ఎవ్వరూ వ్యతరేకించడం లేదు. ఆ చట్టాలను తీసుకు వచ్చిన తీరే తీవ్ర అభ్యంతరకరంగా మారింది. దేశంలో కరోనా మహమ్మారితో ఆర్ధిక అత్యవసర పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి, ఆ తర్వాత రాజ్యసభలో మూజువాణి ఓటుతో అర్ధాంతరంగా ఆమోదింపవలసిన అవసరం ఎందుకొచ్చింది? సంవత్సర కాలంగా రైతులు ఉద్యమాలు జరుపుతూ ఉంటే మొదట్లో 11 పర్యాయాలు చర్చలు జరిపినా, గత జనవరి నుండి ఆగిపోయాయి. చర్చలు జరిపిన మంత్రులకు నిర్ణయాలు తీసుకొనే అధికారం లేదు. మొదట్లోనే స్వయంగా ప్రధాని చర్చలు జరిపి ఉంటే కొన్ని మార్పులతో చట్టాలను కొనసాగించే అవకాశం ఉండెడిది.
చివరకు చట్టాల ఉపసంహరణ సహితం లోక్‌సభలో మూడు నిమిషాలలో, రాజ్యసభలో ఐదు నిమిషాలలో పూర్తి చేశారు. ఎందుకు ఉపసంహరించుకోవలసి వచ్చిందో కూడా వివరణ ఇవ్వలేదు. గత జూన్ లోనే ఈ బిల్లులను పార్లమెంటరీ కమిటీకి నివేదించి ఉంటే, క్లాజులవారీగా చర్చలు జరిపి, ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉండెడిది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల అల్లర్ల కారణంగా చర్చలకు అవకాశం ఉండటం లేదని ప్రభుత్వం చెబుతున్నది. అయితే అర్ధవంతమైన చర్చలకు అవసరమైన వాతావరణం కల్పించవలసిన బాధ్యత ఎక్కువగా ప్రభుత్వంపైననే ఉంటుంది. గతంలో కీలక బిల్లులు తీసుకొచ్చే సమయంలో ప్రముఖులైన ప్రతిపక్ష నాయకులతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపి, వారి సహకారం కోరే సాంప్రదాయం ఉండెడిది. కానీ, ప్రధాని మోడీ అటువంటి ప్రయత్నాలు చేయడం లేదు.
కేవలం ఒకేసారి, పదవి చేపట్టిన కొత్తలో మరి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలను టీ కి ఆహ్వానించి, సహకారం కోరారు. వారు అందుకు హామీ ఇచ్చారు. కానీ ఆ సాయంత్రమే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నది అంటూ పార్లమెంటరీ మంత్రి విమర్శలు గుప్పించడంతో కాంగ్రెస్ వెనుకడుగు వేయవలసి వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విధి అన్ని పక్షాల సహకారం కోసం ప్రయత్నించడం. కానీ ఆయనే రెచ్చగొట్టే ప్రకటనలు ఇస్తూ, ప్రతిపక్షాలు సహకారం అందించలేని పరిస్థితులు కల్పించడం జరుగుతున్నది. కానీ రోజుల తరబడి ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డంకులు కలిగిస్తున్నా, వారితో సంప్రదింపులు జరిపి, సభా కార్యక్రమాలు సజావుగా జరపడంపట్ల ఆసక్తి కనబరచడం లేదు. రాజ్యసభలో 12 మంది సభ్యులను శీతాకాల సమావేశాలు మొత్తానికి బహిష్కరించడం ద్వారా ఏర్పడిన ప్రతిష్టంభనను ప్రభుత్వం, ప్రతిపక్షాలు చర్చలు జరిపి పరిష్కరించు కోవాలని స్వయంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించడం గమనార్హం. సమావేశాలు సజావుగా జరిగితే బిల్లులపై చర్చలు జరుపవలసి వస్తుందనే భయం ప్రభుత్వంలో ఉందా? అల్లర్ల మధ్యనే చివర్లో బిల్లులపై చర్చలు లేకుండా ఆమోదం పొందే ఎత్తుగడగా కనిపిస్తున్నది. అదే విధంగా సరిహద్దుల్లో చైనా ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం మౌనం వహించడం విస్మయం కలిగిస్తున్నది. గాల్వాన్ లోయ వద్ద భారత్ భూభాగం ఏమైనా చైనా ఆక్రమించిందా అనే ప్రశ్నను ‘దేశ భద్రత’ను సాకుగా చూపి రాజ్యసభలో ప్రభుత్వం అనుమతించకపోవడం గమనిస్తే వాస్తవాలను ఉద్దేశ పూర్వకంగా కప్పిపుచ్చుతున్నట్లు భావించవలసి వస్తుంది.
ఇతర దేశాల ఆక్రమణలో ఉన్నప్పటికీ మన భూభాగాలలో ఆయా దేశాలు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టినా మనం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటాము. ఉదాహరణకు ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో పాకిస్థాన్ ఎటువంటి చర్యకు పాలపడినా భారత ప్రభుత్వం వెంటనే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కానీ అరుణాచల్‌ప్రదేశ్ వద్ద భారత భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థలు సాటిలైట్ చిత్రాలతో వెల్లడి చేస్తుండగా, భారత్ స్పందించిన తీరు విస్మయం కలిగిస్తుంది. ఆ భూభాగాలు చైనా ఆధీనంలోనివే అంటూ చెప్పడం మన భూభాగాల ఆక్రమణను సమర్ధించుకొనే అవకాశం పొరుగు దేశాలకు కల్పిస్తున్నట్లుగా ఆందోళన చెందవలసి వస్తున్నది. చైనా అభిమానిగా పేరొందిన డా॥ సుబ్రమణ్యస్వామి వంటి వారే చైనా విషయంలో భారత్ ‘లొంగుబాటు’ ధోరణి ప్రదర్శిస్తున్నది అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి చైనా అధ్యక్షుడిని ప్రధాని మోడీ కలసినన్ని సార్లు ఇప్పటి వరకు భారత ప్రధానులు ఎవ్వరూ కలవలేరు. అయితే ఆ దేశంతో మన సంబంధాలు తీరా ప్రతిష్టంభనకు చేరుకొన్నాయి.

 చలసాని నరేంద్ర, 9849569050

Editorial on PM Modi withdraw Farm Laws

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News