హైదరాబాద్: సమాజంలో రుగ్మతలు అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. బంజారాహిల్స్‌లో బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో గురుకుల అవార్డుల ప్రధానోత్స కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోఠిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. పాలితులుగా ఉన్నా ఎస్సి, ఎస్టిలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. చాలామంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని.. చదువు (Education) మాత్రమే అని సిఎం అన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువులతోనే (Education) సాధ్యమవుతోందని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని సిఎం (Revanth Reddy) పేర్కొన్నారు.
ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే.. పరిసరాలు, మౌలిక వసతులు బాగుండాలని అన్నారు. ఎస్సి, ఎస్టి, బిసిల పిల్లలకు చదువులు వద్దు, కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారని.. దళితులు, బిసిలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్లుగా మాజీ సిఎం వ్యవహరించారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారని పేర్కొన్నారు. మాజీ సిఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు కానీ, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే.. మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ, ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని స్పష్టం చేశారు.