Tuesday, November 12, 2024

కమ్ముతున్న వాయు కాలుష్యం

- Advertisement -
- Advertisement -

శీతాకాలం సమీపిస్తుండటంతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మళ్లీ వాయు కాలుష్యానికి స్వాగతం ఇస్తున్నాయి. గత నెల ప్రధాని కార్యాలయం ఈ రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణించకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. వాహనాల కాలుష్యంతోపాటు, రోడ్లు, నిర్మాణాల దుమ్ముధూళి, ఘనవ్యర్థాల నిర్వహణ ఇవన్నీ గత కొన్నేళ్లుగా వాయు కాలుష్యానికి దారి తీస్తున్నాయని చర్చించారు. పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను మండించడం పెద్ద సమస్యగా తయారైంది. అక్టోబర్, నవంబర్ నెలలో కాలుష్యంలో 40% ఈ పంట వ్యర్ధాలే కారణమవుతున్నాయి. ఈ ఏడాది పంజాబ్‌లో 19.52 మిలియన్ టన్నులు, హర్యానాలో 8 మిలియన్ టన్నుల వరి వ్యర్థాలను దగ్ధం చేస్తారని అంచనా.

అయితే ఈ రెండు రాష్ట్రాలూ ఈ ఏడాది పంట వ్యర్థాలను దగ్ధం చేయకుండా నివారిస్తామని హామీ ఇచ్చాయి. గత ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు ఈ పంట వ్యర్థాల కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను దగ్ధం చేయకుండా పూర్తిగా నిలువరించాలని ఆదేశించింది. ఈ ఏడాది రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా కేంద్రం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది. 2023 పంటకోతల సీజన్‌లో పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధం సంఘటనలు 2022 తో పోలిస్తే 59% తగ్గాయి. అలాగే హర్యానాలో 2023లో 40% తగ్గాయి. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం పంటవ్యర్ధాల దగ్ధం సంఘటనలు 30% పెరగడం గమనార్హం. ఈ సమస్య నివారణకు ఆర్థిక రాయితీలు కల్పించడం, ఇతర చర్యలు తీసుకోవడం తప్పనిసరి. పంట వ్యర్థాలను 11.5 మిలియన్ టన్నుల వరకు దగ్ధం చేయకుండా పొలాల్లోనే వాటిని వినియోగించడం, మిగతా వ్యర్థాలను బయటకు తరలించడం చేస్తామని పంజాబ్ పేర్కొంది.

దీంతో పాటు 2 మిలియన్ టన్నుల వరిగడ్డి వ్యర్థాలను ఎన్‌సిఆర్ రీజియన్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్లలో మండించడానికి వినియోగిస్తున్నారు. అంటే వరిగడ్డి వ్యర్థాలను గుళికలుగా తయారు చేసి కార్బన్ వనరుగా వినియోగిస్తుంటారు. అయితే దీనికి కావలసిన యంత్రాలు రైతులకు అందుబాటులో లేవు. విద్యుత్ ప్లాంట్లలో పంట వ్యర్ధాలను వినియోగించడం ఒక పరిష్కార మార్గమే అయినప్పటికీ, పొలం నుంచి పవర్‌ప్లాంట్‌కు ఈ వరిగడ్డి గుళికలను రవాణా చేసే వ్యవస్థ లేదు. పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితమైన విధానాలు పాటించకపోవడం రైతులకు నష్టాలకు దారితీస్తోంది. సీజన్‌లో రెండు పంటలు వేస్తేనే కానీ తమకు నష్టాలు తీరవన్న ఉద్దేశంతో రైతులు వరిగడ్డిని దగ్ధం చేసి గోధుమ పంట సాగుకు సమాయత్తం అవుతుంటారు. అదే పంట వ్యర్థాల దగ్ధానికి దోహదమవుతోంది. వరికి బదులుగా పెసర వంటి పప్పు ధాన్యాల సాగును చేపట్టినా గిట్టుబాటు ధర లభించడం లేదు.

అందువల్ల చేసేది లేక వరిని సాగు చేయవలసి వస్తోందని రైతులు చెబుతున్నారు. వరిగడ్డి దగ్ధం వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యాల నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయాలను పక్కనపెట్టి సమష్టిగా కృషి చేస్తేనే కానీ సత్ఫలితాలు రావు. ఢిల్లీలో గత ఏడాది రికార్డు స్థాయిలో వాయు నాణ్యతా ప్రమాణాలు పడిపోయాయి. మళ్లీ గత కొన్ని రోజులుగా వాయు నాణ్యత క్షీణిస్తోంది. గత మూడు నెలల్లో మొదటిసారి ఎక్యుఐ (వాయు నాణ్యత ప్రమాణాలు) 200 నుంచి 300 మధ్యకు చేరుకుంది. ఐక్యుఎయిర్ 2023 నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కాలుష్య దేశాల్లో మన దేశం మూడో స్థానంలో ఉంది. దేశంలో సగటున క్యూబిక్ సెంటీమీటర్‌కు ఎయిర్‌బోర్న్ పర్టిక్యులర్ మేటర్ (ఎం.పి) 2.5 మైక్రోగ్రామ్స్ గాను, గాఢత 54.4 మైక్రోగ్రామ్స్ గాను కొనసాగుతోంది.

గాలిలో కాలుష్యానికి కారణమయ్యే వివిధ రకాల వాయువులు, రసాయనాల మిశ్రమాన్ని ఎంపిగా పేర్కొంటారు. వాయు కాలుష్యం కారణంగానే మన దేశంలో సగటున సంవత్సరానికి రూ. 2.7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోందని నివేదికలు చెబుతున్నాయి. స్థూల జాతీయోత్పత్తిలో ఇది 1.36 శాతం. వాహనాల నుంచి పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, రసాయన వాయువులు, పరిశ్రమల నుంచి వెలువడే సల్ఫర్‌డైయాక్సైడ్, కార్బన్ డైయాక్సైడ్ కాలుష్యాలతో వాతావరణం పూర్తిగా కలుషితమవుతోంది. పంట వ్యర్థాలను దగ్ధం చేయడంతో శీతాకాలంలో ప్రజలకు శ్వాసకోశ సమస్యలు, గుండెజబ్బులు, అకాల మరణాలు సంభవిస్తున్నాయి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సిఎపి) ప్రస్తుతం వాయు నాణ్యత పిఎంను 2.5 కంటే తగ్గించాలని లక్షంగా పెట్టుకుంది. ఈ లక్షంలో కనీసం 20నుంచి 40 శాతం వరకైనా 2026 నాటికి సాధించవలసి ఉంది. ఈ మేరకు లక్షాలను సాధించకపోతే ఢిల్లీలో ఎవరూ నివసించలేని దుర్భర పరిస్థితి దాపురిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News