Friday, June 6, 2025

అంగన్వాడీలో చిన్నారులకు ఎగ్ బిర్యానీ: మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న ఆహారంలో మరింత పౌష్టిక విలువలు ఉండే విధంగా వారంలో ఒకటి రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మారుస్తామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాల రూపురేఖలను సమూలంగా మార్చామన్న సీతక్క అంగన్వాడీల్లో 25 శాతం అడ్మిషన్లు పెరిగేలా సిబ్బంది మొత్తం చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. ఇందుకు గాను అమ్మమాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రం అంటే చిన్నారుల్లో సృజనాత్మకత సృష్టించే వికాస కేంద్రాలుగా తీర్చి దిద్దాలని అన్నారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేదో మదన సదస్సు 2025లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో అందుతున్న సేవలు, పూర్వ ప్రాథమిక విద్యను పొందుపరుస్తూ రూపొందించిన ప్రీస్కూల్ వీడియోను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన మేదోమధన సదస్సులో తమ అనుభవాలను, ఆలోచనలను పలువురు డిడబ్లుఓలు, సీడీపీఓలు, సూపర్వైజర్లు పంచుకున్నారు. వక్తలు తెలిపిన అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం మంత్రి ప్రసంగించారు. బడి గంట తరహాలో అంగన్వాడి కేంద్రాల్లోనూ గంట కొట్టే పద్దతి తీసుకురావాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో ఉదయం గంటను మోగించడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సకాలంలో వచ్చేందుకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. మన పని తీరును మెరుగుపరిచేందుకు, మన బెస్ట్ ప్రాక్టీస్ ను విస్తరింప చేసేందుకు ఈ మేదో మదన సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మేదో మదన సదస్సులో మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలను క్రోడీకరించి, నిపుణులు మేధావులతో చర్చించి అంగన్వాడీ ల సేవలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.

మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం
అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు దశాబ్ద కాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, తాము అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు కూడా ఇచ్చామని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను రెట్టింపు చేశామన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 93 వేల మంది చిరు గ్రామీణ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్‌లో జీతాలు ఇస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలను గ్రీన్ ఛానల్‌లో ప్రతినెలా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడి టీచర్లు హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు.

అంగన్వాడి కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆటవిడుపుకు, వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీలను సిద్ధం చేసి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్‌ను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని చెప్పారు. అంగన్వాడి లబ్ధిదారులకు అందిస్తున్న కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు. కోడి గుడ్డును ఉడకబెట్టి అలాగే ఇవ్వకుండా, రెండు ముక్కలు చేసి ఇస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి సూచించారు.

అభ్యాసన మెటీరియల్ ను రూపొందించాలి
మనకున్న బడ్జెట్‌లో అంగన్వాడి కేంద్రాలకు చిన్నారులను ఆకర్షించేందుకు వినూత్న ఆలోచనలతో ఆట వస్తువులు, అభ్యాసన మెటీరియల్ ను రూపొందించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఇందిరమ్మ అమృతం ద్వారా కౌమార బాలికలకు పోషకాలతో కూడిన చిక్కిలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టేలా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పని చేయాలని అన్నారు. సమాజం ఇంత అభివృద్ధి చెందిన ఇంకా బాల్యవివాహాలు జరగడం బాధాకరమని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలను ఒకే మోడల్‌లో నిర్మించాలని, ఒకప్పుడు అంగన్వాడి కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా ఉండేవని చెప్పారు. మంత్రి సీతక్క వెంట టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ ఫహిo, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. గ్రామీణాభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో ఇప్ప పువ్వు మొక్కలతో పాటు పలు మొక్కలను మంత్రి చేతుల మీదుగా నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News