మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎసిబి దూకుడు పెంచింది. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఎసిబికి మరో అవినీతి అధికారి అడ్డంగా దొరికాడు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో ఎసిబి బుధవారం సోదాలు చేసింది. లంచం తీసుకుంటూ ఇఎన్సీ కనకరత్నం ఎసిబి వలకు చిక్కాడు. డిఇ బదిలీ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. సదరు డిఐని తాండూరు నుంచి వికారాబాద్ బదిలీ కోసం ఇఎన్సీ రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధిత డిఐ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఇఎన్సీ కనకరత్నంను అదుపులోకి తీసుకున్నారు. కనకరత్నంపై ఎసిబి కేసు నమోదు చేసింది. పంచాయతీరాజ్ కార్యాలయంతో పాటు కెపిహెచ్‌బి కాలనీ లోని ఆయన నివాసంలోనూ ఎసిబి సోదాలు నిర్వహించింది. అనంతరం కనకరత్నంను అరెస్టు చేసినట్లు ఎసిబి డిఎస్పీ శ్రీధర్ వెల్లడిం చారు. కాగా, పంచాయతీ రాజ్ శాఖలో ఈఎన్సీ హోదాలో కొన్ని రోజుల క్రితమే కనకరత్నం పదవి విరమణ చేశారు. ఏడాది పాటు కనకరత్నం పదవిని ప్రభుత్వం పొడగించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధరరావును కూడా ఎసిబి అరెస్ట్ చేసిన విషయం విదితమే.