Saturday, April 27, 2024

హామీల అమలు ఈజీ కాదు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేతలు వాళ్లలోవాళ్లే తిట్టుకుంటారు
వారి ప్రతిష్ట తగ్గించుకుంటారు
ప్రతిపక్షంలో ఉన్నామని అధైర్యమొద్దు

పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కే ప్రజల మద్దతు

సిఎం రేవంత్‌ను కలుసుకోవాలనుకునే ఎంఎల్‌ఎలు ముందస్తుగా పార్టీకి తెలియజేయాలి
ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి
అంతకుముందు గజ్వేల్ ఎంఎల్‌ఎగా ప్రమాణస్వీకారం చేసిన కె.చంద్రశేఖర్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్:  ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం అంతా ఈజీ కాదని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ లు, ఎంఎల్‌సిలతో గురువారం కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నామని ఏ ఎంఎల్‌ఎ కూడా అదైర్యపడొద్దని అన్నారు. అందరూ దైర్యంగా ఉండాలని ప్రతిపక్షంలో ఉండటం తప్పుకాదని అన్నారు. మనకు ఏ తొందర లేదని, కాంగ్రెస్ పార్టీకి తగిన సమయం ఇద్దామన్నారు. ఇప్పటికిప్పుడు మనం వారిపై పోరాడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత లు వాళ్లలో వాళ్లే తిట్టుకుంటారని, వాళ్లే తమ ప్రతిష్ఠ తగ్గించుకుంటారన్నారు.

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఎవరైనా సిఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే ముందుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలు జాగ్రత్తగా ఉండాలని అన్నా రు. ఎవరో ఏదో చెబితే విని ఆ ట్రాప్ లో పడవద్దన్నారు. మనం మంచి ఆలోచనలతో ప్రభుత్వంలో ఉన్నవారిని కలిసినా జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు. అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి.. అయితే జనం మధ్య ఉన్నప్పుడే ఆ పని చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలవడానికి ముందుగా పార్టీకి సమాచారం ఇవ్వాలన్నారు. బిఆర్‌ఎస్‌ను బొందపెడతామని కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారని వారి మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజీలేని పోరాటాలతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందామని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపామని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ రాజీలేని పోరాటాలతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎంఎల్‌ఎలు అందరూ రెడీ కావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రజలకు బిఆర్‌ఎస్ పార్టీపై నమ్మకం అలాగే ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మద్దతు బిఆర్‌ఎస్‌కు దక్కుతుందని కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎంపిలతో మాట్లాడిన కెసిఆర్
కృష్ణా నదిపై ప్రాజెక్టులు కెఆర్‌ఎంబి పరిధికి ఇవ్వాలన్న కేంద్రం ప్రతిపాదనలపై కెసిఆర్ ఎంపిలతో చర్చించారు. ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో ఆందోళన చేపట్టాలన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేయాలని ఎంపిలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరసనలు చేపట్టాలని, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి కూడా నిరసన చెప్పాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News