Saturday, July 5, 2025

ఇంగ్లండ్ 407 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 77/3తో శుక్రవారం మూడో రోజు బ్యాటింగ్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాదీ స్టార్ మహ్మద్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. జో రూట్ (22), కెప్టెన్ బెన్ స్టోక్స్ (0)ను సిరాజ్ వెనక్కి పంపాడు. దీంతో 84 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను వికెట్ కీపర్ జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్‌లు తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగారు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ఇద్దరు స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు ఐదు వికెట్లకు 249 పరుగులకు చేరింది. అప్పటికే స్మిత్ (102) సెంచరీని పూర్తి చేశాడు. లంచ్ తర్వాత ఇంగ్లండ్ మరింత దూకుడుగా ఆడింది. ఇటు స్మిత్ అటు బ్రూక్ చెలరేగి ఆడుతూ ముందుకు సాగారు. వీరిని వెనక్కి పంపేందుకు టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో అలరించిన స్మిత్, బ్రూక్‌లు ఇంగ్లండ్‌ను పటిష్ఠస్థితిలో నిలిపారు. టి విరామ సమయానికి బ్రూక్ (140), స్మిత్ (157) పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ (158)ను ఆకాశ్‌దీప్ ఔట్ చేశాడు. దీంతో 303 పరుగుల ఆరో వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. ఆ తర్వాత ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. వోక్స్ (5)ను కూడా ఆకాశ్‌దీప్ ఔట్ చేశాడు.

ఇక సిరాబ్ వెంటవెంటనే మూడు వికెట్లను తీయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 89.3 ఓవర్లలో 407 పరుగుల వద్ద ముగిసింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్ ఆరు, ఆకాశ్‌దీప్ నాలుగు వికెట్లను పడగొట్టారు. భారత్‌కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా తాజా సమాచారం లభించే సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News