Thursday, September 19, 2024

పేదల జోలికొస్తే సహించేది లేదు:ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

అక్రమ కట్టడాల పేరుతో పేదలకు ఇచ్చిన నోటీసులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మల్కాజ్‌గిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. గురువారం నాడిక్కడ మీడియాతో మాట్లాడిన ఈటల పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అక్రమాలు చేసి నిర్మించిన బడా బాబుల నివాసాలు, నిర్మాణాలు కూల్చి వేస్తే ఫర్వాలేదని అదే పేదలు తమ కష్టార్జితంతో చేపట్టిన నిర్మాణాలను అక్రమ కట్టడాల పేరుతో తొలగిస్తే ఊరుకునేది లేదని అన్నారు. చెరువుల్లో పట్టా భూములు ఉంటే పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. అంతేగానీ చెరువుల్లో నిర్మాణాలు ఉన్నాయని కూలగొట్టడం మంచిదికాదని హితవు పలికారు. అలాగే పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సీఎం రేవంత్ సంగతి చూస్తామని ఎంపీ ఈటల ఘాటుగా వ్యాఖ్యానించారు. మీకు తెలిసిందల్లా ఒక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మాత్రమే.

కానీ హస్మత్‌పేట్, అల్వాల్, సరూర్ నగర్, సఫిల్‌గూడ చెరువుల సమీపంలో వందలాది పేద కుటుంబాల కన్నీళ్ల బాధ ఎవరికీ తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హస్మత్‌పేట్ చెరువు వద్ద 125 కుటుంబాలు, అల్వాల్ చెరువు వద్ద 120 కుటుంబాలు 1985లో పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ 60 లేదా 40 గజాల భూమిని కొనుక్కున్నారన్నారు. ఈ కుటుంబాల వారు ధనవంతులు కాదని, కడు పేదవారు అన్నారు. గతంలోనూ సీఎంలు చెరువుల అభివృద్ధి కోసం పని చేశారని చెబుతూ రేవంత్ రెడ్డి మాత్రం ఈరోజే రాష్ట్రం ఏర్పడినట్లు వారే చెరువులను కాపాడుతున్నట్లుగా చేస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నోటీసులు రావడంతో ఇప్పుడు ఆ పేద కుటుంబాలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. వారు కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీల వద్దకు పరుగులు పెడుతున్నారన్నారు. ఇది పార్టీలకు సంబంధించిన పంచాయతీ కాదని, పేదవాళ్ల పంచాయతీ అన్నారు. హైడ్రా పేరుతో మీరు ఏం చేస్తున్నారో తనకు తెలియదని, కానీ ఇదో డ్రామా అని ముందే చెప్పానని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు, గుడిసెలు కూల్చివేస్తే ఖబడ్దార్ అని గతంలోనే హెచ్చరించానని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News