Monday, December 4, 2023

ఆ సినిమాల స్ఫూర్తితో దోపిడీ

- Advertisement -
- Advertisement -

గ్యాంగ్, స్పెషల్ 26 సినిమాలు చూసి దోపిడీకి ప్లాన్ వేసిన నిందితులు
జూవెల్లరీస్ దోపిడి కేసులో నలుగురి అరెస్టు
ఏడు బంగారు బిస్కెట్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సిపి సివి ఆనంద్
సిటీబ్యూరో: సూర్య నటించిన గ్యాంగ్, అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 సినిమాలను స్ఫూర్తిగా తీసుకుని రాబరీ చేశామని సికింద్రాబాద్ జూవెల్లరీ షాపు చోరీ కేసులో నిందితులు వెల్లడించారు. రెండు సినిమాల్లో నకిలీ ఐడి అధికారులుగా నటించి రాబరీ చేస్తారు. వాటిని చూసిన నిందితులు అదే విధంగా జూవెల్లరీషాపులో రాబరీ చేశారు. ఈ నెల 27వ తేదీన మోండా మార్కెట్ సమీపంలోని పాట్ మార్కెట్‌లోని బాలాజీ జూవెల్లర్స్‌లో ఐటి అధికారులమని చెప్పి 17 బంగారు బిస్కెట్లను చోరీ చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఏడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివిఆనంద్ ఐసిసిసిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మహారాష్ట్ర, ఖానాపూర్‌కు చెందిన నిందితులు రెహ్మన్ గఫూర్ అతార్, జకీర్ ఘనీ అతార్, ప్రవీణ్ యాదవ్, ఆకాష్ అరుణ్ హోవిల్‌ను అరెస్టు చేశారు. మిగతా నిందితులు అభిజిత్ కుమార్ గొడికే, అమోల్ గణపాత్రవ్ జాదవ్ అలియాస్ సోమా, సిద్ధనాథ్ అలియాస్ సిద్ధర్థ జాదవ్ అలియాస్ సిద్దు అలియాస్ రుషికేష్ యాదవ్, సంజీవ్ పరసురాం జాదవ్, శుభం వినోద్ జాదవ్, అజయ్ వినోద్ జాదవ్ పరారీలో ఉన్నారు. జకీర్ ఘనీ నెల క్రితం హర్షద్ గోల్డ్ మెల్టింగ్ షాపులో పనిలో చేరాడు. బంగారు దుకాణాదారులు బంగారాన్ని ఇస్తే వాటి ద్వారా ఆభరణాలు తయారు చేసి వారికి తిరిగి ఇస్తారు. దీంతో నిందితుడికి బంగారు షాపుల్లో బార్ల రూపంలో బంగారం ఏప్పుడు తెస్తారనే విషయంపై అవగాహన ఉంది. దీంతో తనకు తెలిసిన మిగతా వారితో కలిసి రాబరీకి ప్లాన్ వేశాడు. దీనికి అనుగుణంగా వారిని నగరానికి రప్పించాడు. నిందితులు బస్సు, రైలు ద్వారా వచ్చి ప్యాట్నీలోని ఢిల్లీ లాడ్జిలో ఈ నెల 24వ తేదీన బసచేశారు. అదే రోజును జకీర్ లాడ్జికి వెళ్లి నిందితులకు ఐటి అధికారుల పేరు చెప్పి ఎలా దోచుకోవాలో వివరించాడు.

దానికి అనుగుణంగా నిందితులు 27వ తేదీ ఉదయం 11.40 గంటలకు జూవెల్లరీ షాపుకు వచ్చి ఐటి అధికారులమని బెదిరించారు. నకిలీ ఐడి కా ర్డులు చూపించి ఐటి కట్టకుండా బంగారం విక్రయిస్తున్నారని బెదిరించారు. షాపులోని 17 బంగారు బిస్కెట్లను తెప్పించారు, సిబ్బందిని అందరినీ ఓ గదిలో బంధించి 1,700 గ్రాముల బంగారు బిస్కెట్లను తీసుకుని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సైలు అశోక్ రెడ్డి, శ్రీకాంత్, అనంతచారి, అరవింద్ గౌడ్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News