Saturday, April 27, 2024

కేంద్ర నిధులపై వాస్తవాలు-వక్రీకరణలు

- Advertisement -
- Advertisement -

‘నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి. లేకుంటే అబద్ధమే నిజంగా మారి దేశాన్ని నాశనం చేస్తుంది’ డా. బిఆర్ అంబేడ్కర్. ‘నిజం గడప దాటే లోపు.. అబద్ధం వెయ్యి మైళ్ళు ప్రయాణిస్తుంది. అయితే, నిజం గడప దాటిన మరుక్షణమే.. అబద్ధం అదృశ్యమవుతుంది’ అంటుంటారు పెద్దలు. ఈ విషయం కేంద్ర నిధుల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత ఆర్థిక సాయం రావడం లేదని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గత కొంత కాలంగా అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయి. బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాలు కేంద్రం తమకు తక్కువగా నిధులు ఇస్తోందని పదేపదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఇవే తప్పుడు ఆరోపణలు చేసింది. కానీ, బిజెపి అగ్రనాయకులు ఎప్పటికప్పుడు ఈ తప్పుడు ఆరోపణలను తిప్పికొడుతూ వచ్చారు. ఏటా కేంద్రానికి జమ అయ్యే కార్పొరేషన్, వెల్త్ ట్యాక్సు, సెంట్రల్ జిఎస్‌టి, కస్టమ్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్సు కలిపి ట్యాక్స్ పూల్‌లో జమ అవుతాయి. ఈ మొత్తం పన్నుల ఆదాయంలో 41% రాష్ట్రాలకు కేంద్రం పంచుతుంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేయడం దయతో ఏమీ కాదని, అది రాజ్యాంగ బాధ్యత అని, రాష్ట్రాల హక్కు అని బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పదే పదే మాట్లాడేవారు. కానీ, వాస్తవంగా గతంలో తెలంగాణలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను సక్రమంగా వాడుకోకుండా, కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్రానికి నష్టం చేసిందనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం సరఫరా చేసింది. కానీ, ఆనాటి సిఎం కెసిఆర్ గత పదేళ్లలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులే ఇవ్వలేదు.కొత్త రేషన్ కార్డులిస్తే, అందులో ఎక్కడ మోడీ ఫోటో పెట్టాల్సి వస్తుందోననే కుట్రతోనే కొత్త రేషర్ కార్డులను ఇవ్వకపోవడంతో పేదలకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుంటే అవన్నీ తామే ఇచ్చినట్లుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. దేశంలో 4 కోట్ల మందికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే ఆ నిధులతోనే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి, తమ గొప్పగానే చెప్పుకుంది. అలాగే, పేదలకు వైద్య సౌకర్యాలందించేందుకు ప్రజలకు మంజూరు చేసిన ఆయుష్మాన్ భారత్ సేవలను కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందకుండా చేసిందనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోంది.

వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి చేకూరడం లేదని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది.ఈ కారణంగానే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరెవరు ఈ పథకాలకు అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దేశంలో ప్రధాని మోడీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ యాత్రలో ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఎంతగానో తోడ్పడుతున్నది.దీనిని నవంబర్ 15 వ తేదీన ఆదివాసీ గౌరవ్ దివస్ సందర్భంగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా వేదిక అయింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఈ యాత్ర దేశంలోని 24 రాష్ట్రాల్లోని 68 జిల్లాలతో పాటూ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాగుతున్నది.దేశ వ్యాప్తంగా 8,500 పై చిలుకు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గడిచిన పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమాలను గ్రామస్థాయిలో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

కేంద్ర పథకాల్లో ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ పిఎంజెఎవై, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి విశ్వకర్మ, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి), ప్రధాన మంత్రి పోషణ్ అభియాన్, జల్ జీవన్ మిషన్, గ్రామాల సర్వే, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన తరంతో మ్యాపింగ్ (ఎస్‌విఎఎంఐటివిఎ), జన్‌ధన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, గృహ నిర్మాణం, వ్యవసాయం, ఆర్థిక చేయూతకు సంబంధించిన పథకాలపై ఊరూరా, వాడవాడలా విస్తృతంగా ప్రచారం జరుపుతున్నారు. కేంద్ర పథకాలతో ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు సేకరిస్తున్నారు. ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో నేరుగా వారినే అడిగి తెలుసుకుంటున్నారు. అబద్ధం దర్జాగా బతుకుతూ ఏదో ఒక రోజు చస్తుంది. కానీ, ఏనాటికైనా నిజమే భవిష్యత్‌కు చరిత్రగా మారిపోయి, నిత్యం వర్ధిల్లుతుందనే విషయాన్ని అందమైన అబద్ధాలను నమ్మిస్తూ, నటిస్తూ చెప్పే వారు గుర్తెరగాలి.

పిఎల్ శ్రీనివాస్
(బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News