Saturday, June 3, 2023

తెలంగాణలో రైతే రాజు: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

భువనగిరి: దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కప్పుడు వ్యవసాయం చేస్తున్నంటే భయపడి సిగ్గుపడే రోజుల నుండి కాలర్ ఎగరేసీ మేము చేస్తున్నది వ్యవసాయం అని చెప్పుకుని మురిసె వాతావరణం నెలకొందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలే దోహదపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. యాదాద్రి భునగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 1000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గలిగిన గోడౌన్ నిర్మాణానికి సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాకే కోటి 47 లక్షల ధాన్యం దిగుబడి తో రికార్డ్ సృష్టించిందన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతం నుండి కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికే పరిమితము కాగా ఇప్పుడు కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే 47 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయినా ముఖ్యమంత్రి కెసిఆర్ మనసులో తెలియని వెలితి ఉందన్నారు. కష్టానికి, పెట్టుబడికి సరిపడా రైతు దిగుబడి సాదించలేకపోతున్న బాధ సిఎం కెసిఆర్ ను వెంటాడుతుందని మంత్రి వెల్లడించారు.

ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపినప్పుడు మాత్రమే ఎకరాకు మూడు లక్షల వరకు ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు. కూరగాయల మొదలు అనేక ప్రత్యామ్నాయ పంటలు ఉన్నప్పటికీ మూస పద్దతిలో వ్యవసాయానికి రైతు అలవాటు పడ్డారన్నారు. తెలంగాణ ఏర్పడితే రైతును రాజును చెయ్యొచ్చు అన్న ముఖ్యమంత్రి సంకల్పం అయితే నెరవేరిందని, అదే రైతు మరింత సుసంపన్నం కావాలి అన్నదే కెసిఆర్ తపన అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర పాలనలో సాగర్ ఎడమ కాలువ కింద భూములకు వరుసగా మూడు మార్లు నీళ్లు విడుదల చెయ్యలేని దుస్థితి నుండి తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా 16 వ మారు నీటిని విడుదల చేసుకున్నాం అంటే ముమ్మాటికి ఆ ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దక్కుతుందన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాకే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించామని మరింత పురోగతిని సాదించేందుకే ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా రైతుబందు పధకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ పేరు ప్రపంచ చిత్రపటంలో మారుమ్రోగుతుందన్నారు. అందుకే వలసలకు కేరాఫ్ గా నిలిచిన మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన రైతులు వాపస్ రావడమే కాకుండా దేశం నలుమూలల నుండి తెలంగాణకు వలసల ప్రవాహం జోరందుకుందన్నారు. మహాబుబ్నాగర్ జిల్లాలో వరి నాట్ల కోసం సరిహద్దున కర్నాటక తో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆటోలు, ట్రాలీలు దాటిపోయి లారీలలో నాట్లు వేసేందుకు పొలాలు కోసేందుకు కూలీలు వలసలు వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి నాయకత్వం లో రైతు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారనడానికి అద్దం పడుతుందన్నారు. భువనగిరి సహకార సంఘం అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News