Wednesday, September 18, 2024

ఏరువాకా? పోరుబాటా?

- Advertisement -
- Advertisement -

‘వ్యవసాయదారులు అత్యంత విలువైన పౌరులు.. వారి సాగుసేవ వారి దేశంతో ముడివడి ఉంది’ అని మేధావి థామస్ జాఫెర్సన్ విలువైన సందేశం ఇచ్చారు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా కష్టాన్నే నమ్ముకుని సాగే రైతును కొనియాడాల్సిందే.. జై జవాన్ జైకిసాన్ జంట నినాదాన్ని ద్విగుణీకృతరీతిన మోగించాల్సిందే. తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టబద్ధత దిశలో ఉత్తరాదిన రైతులు సాగించిన ఢిల్లీ చలో ఆందోళన దేశ వ్యాప్తంగా జనావళి ఆలోచనల కేంద్రీకృత అంశం అయింది. పంజాబ్ నుంచి సాగిన రైతుల చలో ఢిల్లీ హర్యానా మీదుగా దేశ రాజధాని సరిహద్దులకు చేరేందుకు సమాయత్తం అయిన దశలో తలెత్తిన పరిస్థితితో రైతుల సంఘర్షణ సమితి, రైతుల ప్రతినిధులు, అధికార యంత్రాంగం నడుమ తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది.

దీనిని నివారించేందుకు మూడు దఫాలుగా సాగిన చర్చలు విఫలం అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకూ సాగిన నాలుగవ దఫా చర్చలలో సమరం నుంచి సంధి సూచకపు తొలిపొద్దు కోడి కూసింది. రైతుల డిమాండ్ల పరిష్కార దిశలో కేంద్ర మంత్రుల బృందం నుంచి కొన్ని ప్రతిపాదనలు వెలువడ్డాయి. వీటిని తాము రైతులతో చర్చించి తమ సమాధానం తెలియచేస్తామని రైతుల ప్రతినిధి సర్వాన్ పంథేర్ ప్రకటించారు. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ఎంఎస్‌పి ప్రాతిపదికన ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అని కేంద్ర మంత్రుల బృందం తెలిపింది.దీనికి తగు సమాధానం తాము ఇవ్వడానికి తమకు గడువు కావాల్సి ఉంటుందని రైతుల ప్రతినిధులు తెలిపారు. అయితే పంటలకు కనీస మద్దతు ధర అనేది తమ హక్కు అయినందున, ఇది పదేపదే తలెత్తే డిమాండ్, ప్రభుత్వం నుంచి కనికరింపులు, స్పందనల తంతు కాకుండా ఉండేందుకు దీనికి చట్టబద్ధత కల్పించాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని రైతుల నేతలు స్పష్టం చేశారు.

ఈ ఆయువుపట్టు వంటి డిమాండ్ విషయంలో తాము వెనకంజ వేసేది లేదని తెలిపారు. దీనితో శంభు సరిహద్దులలో నెలకొన్న ఉత్కంఠత, ఉద్రిక్తతల ఘట్టం. అక్కడ 72 సంవత్సరాల రైతు గుండెపోటుతో కన్నుమూసిన దశలో భావోద్వేగాల నడుమ కొనసాగుతోంది. పంటలకు కనీస మద్దతు ధరల చట్టబద్ధమైన గ్యారంటీతో పాటు స్వామినాథన్ కమిషన్ నివేదికలను కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరాలని రైతు పెద్దలు స్పష్టం చేశారు. రైతులు, రైతుకూలీలకు పింఛన్లు, పంటరుణాల మాఫీలుండాలి. కరెంటు బిల్లులలో పెరుగుదల ఉండరాదని తెలిపారు.2013 నాటి భూసేకరణ చట్టం పునరుద్ధరణ, ఢిల్లీలో 2020లో జరిగిన రైతుల ఉద్యమం దశలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలనేది కూడా తమ ప్రధాన డిమాండ్లలో ఉన్నాయని రైతు నేతలు తమ తుది నిర్ణయానికి ముందు కేంద్రానికి తెలిపారు.

నిజానికి ఇప్పుడు రైతులు ఉద్యమ పంథాను ఎంచుకోవడం, పొలాలు వీడి, రాదార్ల వెంబడి పడి ముందుకు సాగాల్సి రావడం, బారికేడ్లు తోసుకుసాగడం అనేది కీలక ప్రశ్న అయింది. రైతులు చెపుతున్న స్వామినాథన్ కమిషన్ నివేదికలోని అంశాలను రైతుల ఆశశ్వాసల ఆయువుపట్టు అయిన సాగుశ్రమ జీవన క్రమపు సౌలభ్యానికి ఇంతకాలం ఏ పాలకులూ ఎందుకు పట్టించుకోలేదు? ఈ నివేదికను ప్రభుత్వ తిజోరిలోనే ఎందుకు పదిలం చేసి పూజిస్తున్నారనేది కీలక ప్రశ్న అవుతోంది. ఈ కమిషన్ నివేదిక ఇప్పటిది కాదు.2004 డిసెంబర్ నుంచి 2006 డిసెంబర్ మధ్యలో ఐదు అంచెల నివేదికలుగా దీనిని అందించారు.అన్ని నివేదికల్లోనూ రైతుల సాగు క్రమంలో వారు ఎదుర్కొంటున్న కరడుగట్టిన కడగండ్లు, రైతులలో తలెత్తుతున్న నిరాశా నిస్పృహలు, ప్రత్యేకించి అన్నదాతల ఆత్మహత్యల గురించి విశ్లేషించుకుంటూ పలు ప్రతిపాదనలను పొందుపర్చారు.

రైతాంగం కోసం ఓ కేంద్రీకృత సమగ్రమైన జాతీయ విధానం అవసరం అని స్పష్టం చేశారు. రైతాంగపు జీవనవృత్తి అయిన వ్యవసాయానికి మరింత ఊతం ఇచ్చేందుకు, వ్యవసాయం గిట్టుబాటు పని అని తేల్చేలా చేసేందుకు సరైన చర్యలకు దిగండనే నిక్కమైన నిజాలను సర్కారు ముందుంచారు. అయితే ఏ సర్కారు వచ్చినా ఏమున్నది గర్వకారణం అనే రీతిలో నేతలు ఎన్నికలవేళ స్వామినాథన్ కమిషన్ నివేదికను కళ్లకు అద్దుకున్నట్లుగా మాట్లాడటం నేతలు వంటబట్టించుకున్నారు. తరువాత ఇది ఫైళ్ల దొంతరల నడుమ మరో ఫైలు అవుతోంది.

భూసంస్కరణ, సాగునీటిపారుదల, రుణాలు, బీమాలు, ఆహార భద్రత, ఉపాధి, ఉత్పాదకత, తోటిపోటీ ప్రపంచంలో ముందుకు సాగేలా వ్యవసాయ రంగం తీర్చిదిద్దే చర్యలు వంటివి స్వామినాథన్ కమిషన్ నివేదికలోని సూత్రాలు అయ్యాయి.మరి కేంద్రం ఇప్పుడు స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించినందుకు, ఇందుకు ఆయన నివేదికనే ఆధారభూతం అయినందుకు ఇక ఈ నివేదిక అమలుకు ఎందుకు తాత్సరం? చిత్తశుద్ధి దేని మీద? ఎంతకూ కీలకమైన అంశాలపై ఎటూ తేల్చని తంతు ఎవరి కళ్లకు గంతలు కట్టేందుకు? రైతుల డిమాండ్లలోనే పరిష్కారం ఉన్నప్పుడు ప్రధాన డిమాండ్ వీడి చుట్టూ కలియతిరగడం దేనికి సంకేతం? ఏది సర్వజన సాగువాదం?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News