వరుస వర్షాలతో నిన్నటి వరకు ఇంటికే పరిమితమైన రైతులు ఇప్పుడు యూరియా కోసం వేకువ జాము నుండే సహకార సంఘం గోదాముల వద్ద పడి కాపులు కాస్తున్నారు. లింగంపేట మండలంలోని నల్లమడుగు సహకార సంఘంలోకి యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు. సోమవారం వేకువ జాము 5 గంటల నుండి సహకార సంఘం ముందు క్యూ లైన్లు కట్టారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ సహకార సంఘానికి చేరుకున్నారు. నల్లమడుగు సొసైటీ పరిధిలో 20 మెట్రిక్ టన్నులు,450 బస్తాల యూరియా మాత్రమే వచ్చిందని, ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల యూరియా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమడుగు సొసైటీ పరిధిలో కోర్పోల్, బానాపూర్, బానాపూర్ తండా, నల్లమడుగు గ్రామాలకు యూరియా అందాల్సి ఉందన్నారు.రైతులు ఆందోళన చెందవద్దని వారం రోజుల్లో మండలానికి కేటాయించిన యూరియా వస్తుందని చెప్పారు.మండలంలో సుమారుగా 98 శాతం యూరియా ను అందజేయడం జరిగిందన్నారు. ఇంకా 180 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని, లింగంపేట్ సింగిల్ విండో పరిధిలో 80 మెట్రిక్ టన్నులు, నల్లమడుగు సొసైటీ పరిధిలో 60 మెట్రిక్ టన్నులు, శెట్పల్లి సంగారెడ్డి సొసైటీ పరిధిలో 20 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని తెలిపారు.