Saturday, July 27, 2024

టెన్నిస్‌కు ఫెదరర్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Federer announces retirement from Tennis

రాకెట్‌కు విశ్రాంతి
టెన్నిస్‌కు ఫెదరర్ గుడ్‌బై
లావెర్ కప్ తర్వాత రిటైర్మెంట్
సంచలన నిర్ణయం తీసుకున్న స్విస్ దిగ్గజం రోజర్
లండన్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(41) ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నెల 23 నుంచి లండన్ వేదికగా జరిగే లావెర్ కప్ ఎటిపి టోర్నమెంట్ తన కెరీర్‌లో చివరి ప్రొఫెషనల్ టోర్నీ అని టెన్నిస్ గ్రేట్ ఫెదరర్ గురువారం వెల్లడించాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఫెదరర్ ఎన్నో చారిత్రక విజయాలను తన పేరిట లిఖించుకున్నాడు. 1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఫెదరర్ ఎన్నో టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. పురుషుల టెన్నిస్‌లో ఫెదరర్ ఓ గ్రేట్‌గా పేరు తెచ్చుకున్నాడు. సమకాలిన టెన్నిస్‌లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి మూడో స్థానంలో నిలిచాడు. చిరకాల ప్రత్యర్థులు రఫెల్ నాదల్ (స్పెయిన్), నొవాక్ జకోవిచ్ (సెర్బియా)లతో కలిసి పురుషుల టెన్నిస్‌లో రెండు దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించాడు. నాదల్ (22), జకోవిచ్ (21) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. వరుస గాయాలతో సతమతమవుతున్న ఫెదరర్ చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఒకవైపు పెరుగుతున్న వయసు, మరోవైపు ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతుండడంతో ఫెదరర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించాడు.
పోరాటానికి మరో పేరు
సుదీర్ఘ కెరీర్‌లో రోజర్ ఫెదరర్ తిరుగులేని ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. పురుషుల టెన్నిస్‌లో చాలా కాలం వరకు ఎదురులేని శక్తిగా కొనసాగాడు. నాదల్, జకోవిచ్ కెరీర్ ప్రారంభానికి ముందు స్విస్ దిగ్గజం ప్రపంచ టెన్నిస్‌ను శాసించాడు. పట్టుదల, పోరాటానికి మరో పేరుగా ఫెదరర్‌ను విశ్లేషకులు అభివర్ణిస్తారు. కెరీర్‌లో ఏకంగా 20 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించాడు. ఈ క్రమంలో సహచరులు నాదల్, జకోవిచ్‌లతో కలిసి చాలా కాలం పాటు సంయుక్త ఆధిక్యంలో కొనసాగాడు. అయితే కొంతకాలంగా ఫెదరర్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. మరో పక్కా వయసు కూడా అతనికి ప్రతికూలంగా మారింది. యువ ఆటగాళ్ల పోటీని తట్టుకుని ముందుకు సాగడం ఫెదరర్‌కు కష్టంగా మారింది. చిరకాల ప్రత్యర్థులు నాదల్, జకోవిచ్‌లు అడపాదడపా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తున్నా జకోవిచ్ మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగించలేక పోతున్నాడు. ఇలాంటి స్థితిలో ఆటకు వీడ్కోలు పలకడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. 1998లో ఫ్రొఫెషనల్ కెరీర్‌కు శ్రీకారం చుట్టిన ఫెదరర్ 24 ఏళ్ల పాటు టెన్నిస్‌లో అగ్రశ్రేణి ఆటగాడిగా కొనసాగాడు. కెరీర్‌లో 82 శాతం విజయాలు నమోదు చేసి ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కెరీర్‌లో ఎన్నో టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాక ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, మరో రజతం దక్కించుకున్నాడు.
వింబుల్డన్ కింగ్
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ప్రతిష్టాత్మకమైన ట్రోఫీగా పేరున్న వింబుల్డన్ ఓపెన్‌లో ఫెదరర్‌కు తిరుగులేని రికార్డు ఉంది. వింబుల్డన్‌లో ఫెదరర్ రికార్డు స్థాయిలో 8 టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేగాక ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ సత్తా చాటాడు. ఈ గ్రాండ్‌స్లామ్ పోటీల్లో ఆరుసార్లు విజేతగా నిలిచాడు. అంతేగాక యూఎస్ ఓపెన్‌పై కూడా తనదైన ముద్ర వేశాడు. యూఎస్ ఓపెన్‌లోనూ ఐదు టైటిల్స్‌తో అలరించాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం ఫెదరర్ ఒకసారి మాత్రమే విజేతగా నిలిచాడు. ఇక ఫెదరర్ కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. నాదల్, జకోవిచ్‌లతో పాటు ఫెదరర్‌కు మాత్రమే ఈ రికార్డు ఉంది.
రికార్డుల రారాజు
కెరీర్‌లో ఫెదరర్ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 237 వారాల పాటు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉండి ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా కూడా ఫెదరర్ రికార్డు సృష్టించాడు. వరుసగా ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. దీంతో మరెన్నో రికార్డులను ఫెదరర్ సొంతం చేసుకున్నాడు.

Federer announces retirement from Tennis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News