Friday, April 26, 2024

భూదస్త్రాల నిర్వహణలో క్షేత్రస్థాయి సిబ్బంది తప్పిదం

- Advertisement -
- Advertisement -

వివాదాస్పద భూములు ధరణి పోర్టల్‌లో చేర్చడంపై
అధికారుల కమిటీ విస్తృత స్థాయి చర్చలు
అసలు సర్వే నెంబర్‌లకు… బై నెంబర్‌లు…

Rythu Bandhu distribution from June 15 in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్:  అసలు సర్వే నెంబర్లకు బై నంబర్లు తోడు కావడంతో చాలాచోట్ల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ధరణి పోర్టల్‌లో నిక్షిప్తమైన ఇలాంటి భూములకు సంబంధించి క్రయ, విక్రయాలతో ఇబ్బందులు నెలకొంటున్నాయని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలైన మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి కేసులు అధికంగా చోటు చేసుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. కొందరు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో సబ్ డివిజన్ పేరుతో బై నంబర్లు కేటాయించారని ఈ నెంబర్‌లు కూడా 2014- నుంచి 18 సంవత్సరాల కాలంలో మధ్యకాలంలో జరిగాయని రెవెన్యూ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో 1936లో తర్వాత భూముల సర్వే పూర్తిస్థాయిలో చేపట్టకపోవడం, జమాబందీ జరగకపోవడంతో అక్రమార్కులకు ఇది కలిసి వచ్చిందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

ఎప్పటికప్పుడు 1 బిలో నమోదు…

ఉదాహరణకు సర్వేనంబర్ 20లో భూమిని ఇద్దరు కొనుగోలు చేస్తే ఆ సంఖ్యకు ‘అ’ లేదా ‘1’ చేర్చుతూ (20/అ లేదా 20/1) వేస్తున్నారు. మరోమారు విక్రయం జరిగితే 20/అ/అ లేదా 20/1/1గా నమోదు చేస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు 1 బిలో (రెవెన్యూ మాతృదస్త్రం) నమోదు చేయాల్సి ఉండగా చాలాచోట్ల చేయలేదు. నిజమైన రైతులకు తెలియకుండా దస్త్రాల్లో మాయ చేసి భూములను వేరొకరు కాజేసేందుకు గతంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది మార్గం చూపారు. ప్రస్తుతం దీనిని అడ్డుకోవడానికి మార్గం లేకపోవడంతో దీనిపై సిఎం కెసిఆర్ స్థాయిలో ప్రత్యామ్నాయ విధానం తీసుకురావాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ భూములకు సైతం బై నెంబర్‌లు

ఏ సర్వే నంబరులో ఎవరున్నారు. ఎంత విస్తీర్ణం ఎవరి పేరున ఉందనే వివరాలను పహాణీలో తెలుస్తోంది. రాష్ట్రంలో 2014కు ముందు ఏటా పహాణీ నిర్వహణ కొనసాగుతుండగా తర్వాత భూ సమాచారం ఆన్‌లైన్‌కి మారడంతో పహాణీని పక్కన పెట్టారు. మాన్యువల్ పద్ధతిలో భూ దస్త్రాలు నిర్వహించిన సమయంలో కొన్ని భూములకు క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టమొచ్చినట్లు ఉప సంఖ్యలను (బై నెంబర్‌లను) కేటాయించారు. ప్రభుత్వ భూములకు కూడా బై నెంబర్‌లు వేసి పట్టా భూములుగా మార్చారని అధికారుల పరీశీలనలో తేలింది.

మార్పులు, చేర్పులు చేయాలంటే …..

ప్రస్తుతం ఈ సమస్యతో చాలామందికి పాసు పుస్తకాలు రాకపోగా వచ్చినా కొందరి పాసు పుస్తకాల్లో కొన్ని సర్వే నెంబర్‌లు నమోదు కాలేదు. ఒకరి భూమి వివరాలు మరొకరి పాసు పుస్తకాల్లో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవన్నింటినీ మార్పులు, చేర్పులు చేయాలంటే చాలా తలనొప్పులని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే నంబర్ల వివరాల్లో మార్పులు చోటుచేసుకుంటే హైదరాబాద్ ఉన్న సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్ వద్ద కూడా నమోదు చేస్తారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భూములకు, పట్టా భూములకు వేసిన చాలా బై నెంబర్‌లు (ఉప సంఖ్యలు) హైదరాబాద్‌లో నమోదు కాలేదని రెవెన్యూ అధికారులు గుర్తించారు.

కమిటీ విస్తృతస్థాయి చర్చ

ఈ నేపథ్యంలో బై నెంబర్లు వేసిన భూములతో పాటు పార్ట్ బి భూములను ధరణి పోర్టల్‌లో ఎలా నమోదు చేయాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ఇప్పటికే అధికారుల కమిటీ విస్తృతస్థాయి చర్చ జరిపింది. అందులో భాగంగా ఈ సమస్యను పరిష్కరించడానికి పలువురు ఐఏఎస్, విశ్రాంత ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. ఈ భూములకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇప్పటికే అధ్యయనం చేయడంతో ఈ భూముల వివరాలకు సంబంధించిన జాబితాను నివేదిక రూపంలో తయారుచేసి ప్రభుత్వానికి అందచేసినట్టుగా తెలిసింది.

తాజా అధ్యయనంలో వాటిని పరిగణనలోకి…

ఒకే సర్వే నెంబర్‌లోని కొంత భూమిని నివాస స్థలాలుగా మార్చి విక్రయించి, మిగిలిన భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న అనేక మంది వివరాలు ఆన్‌లైన్‌లోకి ఎక్కలేదు. కొందరు సాగులో ఉండగా, మరికొందరు ఆధీన ధ్రువీకరణ పత్రం (ఓఆర్‌సీ) పొంది హక్కులు లేకుండా ఉన్నారు. ఒక రైతుకు నాలుగు సర్వే నెంబర్లలో భూమి ఉంటే, ఒక సర్వే నెంబరులోని విస్తీర్ణం ధరణి పోర్టల్‌లో నమోదుకాలేదు. కొందరికి ఉన్న విస్తీర్ణంలో కోతపడింది. తాజా అధ్యయనంలో ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News