ప్రజా పాలనలో క్రమశిక్షణ ఉండేలా చూడడం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఒక విధంగా ప్రభుత్వం చేయలేని పనులను కోర్టు ఉత్తర్వులు చేస్తాయని
ఆయన అన్నారు. సోమవారం ఇక్కడ దివంగత ప్రకాశ్ దేశ్‌పాండే స్మృతి కుశల్ సంఘటక్ పురస్కార్ ప్రదాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ ప్రభుత్వంపై పిటిషన్లు దాఖలు చేసే కొంత మంది వ్యక్తులు సమాజంలో ఉండాలి. ఇది రాజకీయవేత్తలను క్రమశిక్షణలో ఉంచుతుంది.
ఎందుకంటే ప్రభుత్వంలో మంత్రి సైతం చేయలేని పనిని ఒక కోర్టు ఉత్తర్వు చేస్తుంది. ప్రచార రాజకీయాల కారణంగా మంత్రులు, రాజకీయవేత్తలు కొన్ని పనులు చేయలేకపోతున్నారు’ అని గడ్కరీ అన్నారు. కార్యక్రమంలో ‘కుశల్ సంఘటక్’లుగా సత్కరించబడిన వారంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాంటి న్యాయపోరాటాలు చేసిన వారేనని కూడా ఆయన గుర్తు చేశారు. విద్యారంగంలో ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా కుశల్ సంఘటక్‌లు చాలా కోర్టు కేసులు దాఖలు చేశారని, చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన అన్నారు.