Sunday, August 17, 2025

భారత్‌లోనే ఐఫోన్17 తయారీ

- Advertisement -
- Advertisement -

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. తాజాగా యాపిల్ సంస్థ తన కొత్త మోడల్ ‘ఐఫోన్ 17’ ఉత్పత్తిని భారతదేశంలో ప్రారంభించింది. నివేదిక ప్రకారం, బెంగళూరులోని ఫాక్స్‌కాన్ కొత్త తయారీ ప్లాంట్‌లో ఈ ఉత్పత్తి లాంచ్ చేసింది. దాదాపు రూ.25,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించిన ఈ కేంద్రం, చైనా వెలుపల ఫాక్స్‌కాన్‌కు రెండో అతిపెద్ద తయారీ యూనిట్ కావడం విశేషం. భారతదేశంలో ఐఫోన్ తయారీ కేంద్రం ఏర్పాటు అవుతుండటంతో గతంలో 300 మందికి పైగా చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను ఫాక్స్‌కాన్ భారతదేశానికి పంపింది. అయితే ఉత్పత్తి ప్రారంభానికి ముందు చైనా ఈ నిపుణులను అకస్మాత్తుగా వెనక్కి పిలిపించింది. దీంతో ఐఫోన్ 17 ఉత్పత్తిలో కొంత ఆలస్యం ఏర్పడింది.

ఫాక్స్‌కాన్ ఈ అడ్డంకిని అధిగమించడానికి తైవాన్‌తో సహా ఇతర దేశాల నుండి నిపుణులను నియమిస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం ఐఫోన్ 17 ఉత్పత్తి చిన్న స్థాయిలో మాత్రమే ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం కారణంగా తయారీ సరఫరా గొలుసును చైనా నుండి దూరంగా తరలించే ప్రయత్నాలలో భాగంగా యాపిల్ భారతదేశాన్ని ఒక కీలక భాగస్వామిగా చూస్తోంది. దీని ఫలితంగా అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతిలో భారతదేశం చైనాను అధిగమించింది. పరిశోధనా సంస్థ కెనాలిస్ ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో అమెరికా దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లలో ’మేడ్ ఇన్ ఇండియా’ ఫోన్ల వాటా 44 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది కేవలం 13 శాతం మాత్రమే ఉంది. మరోవైపు ఇదే కాలంలో చైనా వాటా 61 శాతం నుండి 25 శాతానికి పడిపోయింది.

ఐఫోన్ల తయారీ హబ్‌గా భారత్
భారత ప్రభుత్వం దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఇండియా ఐఫోన్ తయారీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మార్కెట్ పరిశోధనా సంస్థ కెనాలిస్ ప్రకారం, 2025 జనవరి నుండి జూన్ వరకు భారతదేశంలో 2.39 కోట్ల ఐఫోన్‌లు తయారయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 53 శాతం అధికంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో (జనవరి-జూన్) ఐఫోన్ తయారీ సంఖ్య 1.50 కోట్లు ఉంది. అంటే వార్షిక ప్రాతిపదికన 52 శాతం వృద్ధి నమోదైంది. అమెరికాలో అమ్ముడవుతున్న మొత్తం ఐఫోన్‌లలో 78 శాతం భారతదేశంలోనే తయారవుతున్నాయి. పరిశోధనా సంస్థ సైబర్ మీడియా రీసెర్చ్ ప్రకారం, భారతదేశం నుండి ఐఫోన్ ఎగుమతులు 2.28 కోట్ల యూనిట్లకు పెరిగాయి. భారత్‌లో యాపిల్ తన ఉత్పత్తిని వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. హైటెక్ అసెంబ్లీ లైన్‌లను చైనా ఇంజనీర్లు నిర్వహించి, భారతీయ కార్మికులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కీలకమైన సహకారం కోసం ఉత్పత్తికి ఆటంకాలు కలగకుండా భారత ప్రభుత్వం చైనా ఇంజనీర్లకు వీసా సౌకర్యాలను కూడా కల్పించింది. ఈ చర్యలు భారతదేశం గ్లోబల్ టెక్నాలజీ తయారీ రంగంలో ఒక శక్తిగా ఎదగడానికి దోహదపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News