Friday, March 29, 2024

గుజరాత్‌లో ఆప్‌కు ఓటేస్తే రామభక్తులకు ఉచిత అయోధ్య యాత్ర

- Advertisement -
- Advertisement -

Free Ayodhya Yatra if they vote for AAP in Gujarat

గోసంరక్షణకు రోజువారీ రూ.40 అలవెన్సు,
10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి నెలకు రూ. 3000
గుజరాత్ ఎన్నికల ప్రచార ర్యాలీలో కేజ్రీవాల్ హామీల జల్లు

దాహోద్ : గుజరాత్ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించడానికి ఓటు వేస్తే అయోధ్య రాముడ్ని చూడాలనుకునే భక్తులకు ఆప్ ప్రభుత్వం స్వంత ఖర్చులతో అయోధ్య పంపిస్తుందని ఆప్ అధినేత , ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం వెల్లడించారు. తన కేబినెట్ మంత్రి ఒకరు హిందూ దేవతలను అవహేళన చేస్తూ మాట్లాడిన నేపథ్యంలో ఖండిస్తూ కేజ్రీవాల్ పై ప్రకటన చేశారు. రానున్న గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని, దీనికి కారణం ఈ పార్టీ ప్రజల కోసం, భగవంతుని కోసం పనిచేయడమేనని పేర్కొన్నారు. ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ వందలాది మంది బౌద్ధమతం లోకి మారిపోయినప్పటి కార్యక్రమంలో హిందూ దేవుళ్లను అవహేళన చేయడం వైరల్ కావడంతో దాన్ని ఖండిస్తూ కేజ్రీవాల్ లార్ రామ్‌ను ప్రశంసిస్తూ తెరపైకి తెచ్చారు. గుజరాత్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా మొదటిరోజు దాహోద్‌లో ర్యాలీలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. స్పెషల్ రైలులో రామభక్తులను ఉచితంగా అయోధ్యకు తీసుకెళ్లే స్కీమ్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు.

రామాలయం వచ్చే సంవత్సరానికి సిద్ధమౌతుందని, ఆ ఆలయాన్ని ఎవరైతే చూడాలనుకుంటున్నారో వారందరికీ ఉచితంగా తీసుకెళ్లడమౌతుందని చెప్పారు. అయితే శనివారం అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, వడోదర నగరాల్లో కేజ్రీవాల్ “హిందూ వ్యతిరేకి ” అని కేజ్రీవాల్ బొమ్మతో ఉన్న బ్యానర్లు వెలిశాయి. హిందూమతం ఉన్మాదం అని కొన్ని బ్యానర్లు రాసి ప్రదర్శించగా, మరికొన్ని కేజ్రీవాల్ గో బ్యాక్ అని రాసి ఉన్నాయి. గుజరాత్‌లో ఆప్ అధికారం లోకి వస్తే గోసంరక్షణకు రోజువారీ రూ.40 అలవెన్సుగా మంజూరు చేయడమౌతుందని కేజ్రీవాల్ ర్యాలీలో ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత అవినీతిని నిర్మూలించడమే తమ అత్యంత ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు గుజరాత్‌లో ఎమ్‌ఎల్‌ఎలు, మంత్రులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రభుత్వం నష్టాలపాలైందని, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాటైతే వారి నుంచి ప్రతిపైసా రాబడతామని పేర్కొన్నారు.

అవినీతి, లంచగొండితనం పెకలించగా మిగిలిన డబ్బంతా ఉచిత విద్యుత్తు , నాణ్యమైన విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలు ప్రజలకు అందించడానికే వెచ్చిస్తామని ప్రకటించారు. ఉచిత హామీలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకమని, ఎందుకంటే అలాంటివి అమలైతే వారు దోచుకోడానికి ఏమీ మిగలదన్నదే వారి ఆలోచనగా వ్యాఖ్యానించారు. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3000 అందిస్తామని తమ గ్యారంటీ హామీల జాబితా ఏకరువు పెట్టారు. గోధుమలు, ధాన్యం, సెనగ, వేరుశెనగ, ప్రత్తి, పంటలకు కనీస మద్దతు ధర అందిస్తామని, వ్యవసాయానికి పగటి పూట 12 గంటల పాటు విద్యుత్ అందిస్తామని, పంట నష్టపోతే హెక్టారుకు రూ. 50,000 నష్టపరిహారం అందిస్తామని, నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తామని కేజ్రీవాల్ హామీలు గుప్పించారు. ఈ చిన్న పార్టీ ఢిల్లీ, పంజాబ్‌లో ఘనవిజయం సాధించడం ప్రజల దీవెనవల్లనే అని, ప్రజల కోసం, భగవంతుడి కోసం, నీతి, ధర్మంతో తాము పనిచేయడం వల్ల గుజరాత్‌లో కూడా విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News