Saturday, April 20, 2024

అమరుల ఆశయాలు నెరవేరేదెన్నడు?

- Advertisement -
- Advertisement -

జననం, మరణం సహజమే అయినప్పటికీ మరణం రకరకాలుగా సంభవిస్తుంది. అది ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణంగా, కక్షలు, కార్పణ్యాలతో ఇతరులు చేసే హత్య రూపంలో లేదా ఒత్తిడితో తనకు తాను తెచ్చుకునే బలవన్మరణాలు కావచ్చు. ఇవన్నీ కూడా మరణించే వ్యక్తి మూలంగా సంభవించేవి. అలా కాకుండా ఇతరుల ప్రయోజనాల కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం ప్రాణత్యాగం చేస్తే అది అమరత్వం, దేశవిముక్తి కోసం 20 సంవత్సరాల వయసులోనే కర్తార్ సింగ్ శరభ ప్రాణాలర్పించడంతో అతని స్ఫూర్తిగా భారత దేశ దాస్యశృంఖాలాలను తెంచడానికి ఉరికొయ్యని ముద్దాడిన విప్లవ వీరులు, భారత వేగు చుక్కలు సర్దార్ షహీద్ భగత్ సింగ్, శివరాం రాజ్ గురు, సుఖ్‌దేవ్ థాపర్లు స్వేచ్ఛ, సార్వభౌమాధికారం, సమానత్వాలకై తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులు.

సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు, భూస్వా మ్య సమాజానికి మతోన్మాదం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అమరవీరులు. విద్యావతి, కిషన్ సింగ్ దంపతులకు 1907 సెప్టెంబర్ 28న రాయల్‌పూర్ జిల్లా బంగా గ్రామంలో దేశభక్తియుతమైన కుటుంబంలో భగత్ సింగ్ జన్మించాడు. ప్రస్తుతం ఆ గ్రామం పాకిస్తాన్ లో కలదు. అధిక భూమి శిస్తు, కాల్వ పన్నులను వ్యతిరేకిస్తూ బ్రిటిష్ ప్రభుత్వంపై పంజాబ్ కేసరి లాలాలజపతిరాయ్‌తో కలిసి భగత్‌సింగ్ మామయ్య అజిత్‌సింగ్ శక్తివంతమైన రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించినందుకు బర్మాలోని మాండలే జైలుకు పంపబడ్డారు. భగత్ సింగ్ పుట్టిన సమయంలో ఆయన తండ్రి కిషన్ సింగ్, మరో మామయ్య స్వరణ్ సింగ్ జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు జైల్లో ఉన్నారు. ఇటువంటి కుటుంబ వాతావరణంలో పెరిగిన భగత్ సింగ్ దేశభక్తి భావాలకు ఆకర్షితుడయ్యాడు.

భగత్ పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు 1915 నవంబర్ 16, 17 తేదీల్లో లాహోర్ కుట్ర కేసుల్లో ఏడుగురు గదర్ వీరులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. ఉరి తీయబడిన వారిలో పంజాబ్‌కు చెందిన కర్తార్ సింగ్ శరభ ఒకరు. ఆయన సాహసం, త్యాగపూరిత మరణం భగత్ సింగ్‌ను తీవ్రంగా కలిచివేసింది. అప్పటి నుండి భగత్ సింగ్ తన జేబులో కర్తార్ సింగ్ ఫోటో పెట్టుకునేవాడు. పాఠశాల విద్యను పూర్తి చేసుకుని భగత్ సింగ్ డిఎవి స్కూల్ వదిలి లాలాలజపతిరాయ్ ఏర్పాటు చేసిన నేషనల్ కాలేజీలో చేరాడు. భగవతి చరణవోహ్,్ర సుఖదేవ్, యశ్‌పాల్ భగత్‌కు సహచరులు.చదువు, రాజకీయాల పైన భగత్ సింగ్ ఎంతో శ్రద్ధ కనబరిచేవాడు, ఎక్కువ సమయం అధ్యయనం చేసేవాడు.

తండ్రి, నానమ్మ వివాహానికి బలవంతం చేయడంతో 1924లో భగత్ సింగ్ తన బిఎ చదువు మధ్యలోనే ఆపి లాహోర్‌కి వెళ్ళాడు. ఇది పెండ్లికి సమయం కాదు, దేశం నన్ను పిలుస్తోంది. భౌతికంగా, మానసికంగా నా దేశానికి సేవ చేస్తానని ప్రతిజ్ఞ తీసుకున్నాను. మాతృభూమికి సేవ చేయడం అనే అత్యున్నత లక్ష్యానికి నా జీవితాన్ని అంకితం చేశాను. ప్రాపంచిక సుఖాలు అనుభవించాలన్న కోరిక లేదు అని భగత్ సింగ్ తన తండ్రికి లేఖ రాసి విప్లవోద్యమంలో చురుకుగా పని చేయడం ప్రారంభించాడు. 1924లో కాన్పూర్ చేరుకొని ప్రతాప్ పత్రిక సంపాదకుడు గణేష్ శంకర్ విద్యార్థి దగ్గర షెల్టర్ తీసుకొని చంద్రశేఖర్ ఆజాద్, బట్కేసర్ దత్, జోగేష్ చంద్రచటర్జీ శివ వర్మ విజయకుమార్ సిన్హా కలుసుకున్నాడు. 1923లో ఏర్పాటైన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్‌లో సభ్యుడయ్యాడు.

1926 మార్చిలో నవజవాన్ భారత సభ అనే మిలిటెంట్ యువజన సంఘాన్ని స్థాపించారు. ఈ రెండు సంస్థలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువతను సమీకరించడం ముఖ్య లక్షంగా, యువకులు రైతాంగం కార్మికుల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించేందుకు, విస్తృత ప్రజాపునాది కలిగిన ఉద్యమాలు మాత్రమే విప్లవాలకు దారితీస్తాయని తద్వారా దేశాన్ని బ్రిటిష్‌వారి కబంధహస్తాల నుండి విముక్తి చేయాలని పని చేశారు. రాజ్యాంగ సంస్కరణలపై విచారించేందుకు శ్వేత జాతీయులు కలిగిన సైమన్ కమిషన్ 1928 భారత్‌కు వచ్చింది. ఆ కమిషన్ బహిష్కరించాలని, దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చురుకుగా నిర్వహించాలని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ నిర్ణయించింది.

లాహోర్‌లో లాలాలజపతిరాయ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ ప్రదర్శనపై లాఠీచార్జి జరగడంతో, ఆ దెబ్బలకు తాళలేక నవంబర్ 17న లాలాలజపతిరాయ్ మరణించారు. లాలాలజపతిరాయ్ మరణానికి జాతికి జరిగిన అవమానానికి స్కాట్ని చంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని హెచ్‌ఎస్‌ఆర్‌ఎ నిర్ణయించింది. లాలాలజపతిరాయ్ మరణించిన సరిగ్గా నెల రోజులకు 1928 డిసెంబర్ 17న భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు, సుఖదేవ్ లాఠీచార్జీలో పాల్గొన్న జెపి సాండర్స్‌అనే మరో పోలీస్ అధికారిని హత్య చేశారు. సాండర్స్ ని స్కాట్ అనుకొని చంపారు. సాండర్స్ హత్య తరువాత భగత్ సింగ్ తన సహచరుడైన రాజ్‌గురుతో మారువేషాలతో కలకత్తా చేరుకున్నాడు.

ఉద్రిక్తమవుతున్న కార్మిక వర్గ పోరాటాలను ప్రాబల్యం పెంచుకుంటున్న కమ్యూనిస్టులను అణచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ సేఫ్టీ బిల్, కార్మికవివాదాల బిల్లును ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేట్ అసెంబ్లీలో చర్చకు పెట్టింది. ఈ రెండు దుర్మార్గపు బిల్లుల ఆమోదానికి కార్మిక, కమ్యూనిస్టు నేతల అరెస్టుకు నిరసన తెలియజేసేందుకు సెంటర్ అసెంబ్లీలో బాంబులు వేయాలని నిర్ణయించి, బాంబులు ఎవరినీ చంపడానికి ఉద్దేశించినవి కాకుండా కేవలం ఒక హెచ్చరిక జారీ చేయడానికి బాంబులు విసిరి పారిపోకుండా స్వచ్ఛందంగా అరెస్టయి విచారణ సందర్భంగా హెచ్‌ఎస్‌ఆర్‌ఎ కార్యక్రమాలు సిద్ధాంతాలు దేశం మొత్తానికి తెలియజేసేలా కోర్టు హాలును వేదికగా వాడుకోవాలని నిర్ణయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భగత్ సింగ్, భట్కేసర్‌దత్ పాల్గొన్నారు.1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, భట్కేసర్‌దత్ అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందిన వెంటనే రెండు బాంబులు విసిరేశారు. బాంబులు ఎందుకు విసిరేసారో తెలియజేస్తూ కరపత్రాలు వెదజల్లి పారిపోకుండా స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. పార్లమెంట్లో బాంబులు విసరడం, సాండర్స్ హత్య ఈ రెండింటిపై విచారణ జరిపి అమానుషంగా 1931 మార్చి 23న ఉత్తర్వులకు విరుద్ధంగా ఒకరోజు ముందుగానే రాజ్‌గురు, సుఖదేవ్, భగత్ సింగ్‌లను ఉరి తీయడంతో అమరవీరులయ్యారు. జీవితాన్ని ప్రేమిస్తాం/ మరణాన్ని ప్రేమిస్తాం/ మేము మరణించి/ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం/ ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం.

* తండ సదానందం, 9989584665

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News