ఖాట్మండు: నేపాల్‌లో నిరసనకారులు మళ్లీ రెచ్చిపోయారు. మంగళవారం పార్లమెంట్ ముందు పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళనలకు దిగారు. అంతేకాదు, సమాచారశాఖ మంత్రి ఇంటికి నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజధాని ఖాట్మాండులో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం అవినీతికి, సోషల్ మీడియా నిషేదంపై ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. నిరసనలు హింసాత్మకంగా మారడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసింది.
అయినా శాంతించని నిరసనకారులు.. ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా చేయాలని ఈరోజు మళ్ళీ ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హింసాత్మక ఘటనలతో పలువురు మంత్రులు రాజీనామా చేయగా.. ప్రధాని కెపి శర్మ ఓలి ప్రత్యేక విమానంలో దుబాయ్ వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.