Sunday, May 5, 2024

రుణ యాప్‌ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రుణ యాప్‌ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న ముఠా గుట్టును రాచకొండ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు. పట్టుబడ్డ ముఠా సభ్యుల్లోని ఐదుగురు నిందితులు హర్యానాలోని గురుగ్రామ్ కేంద్రంగా యాప్ నిర్వహిస్తూ రుణాలు ఇస్తున్నారని రాచకొండ సిసి చౌహాన్ బుధవారం మీడియాకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చైనాకు చెందిన జినా అనే మహిళ ద్వారానే లోన్‌యాప్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఆమె గురుగ్రామ్‌కు చెందిన అషుతోశ్ మిశ్ర, లవమిత్ సైనీ, ప్రశాంత్ కుమార్ తన్వార్, ప్రిన్స్‌పాల్, వికాస్ శర్మలను సిబ్బందులుగా నియమించుకొని జినా హ్యాండీ లోన్ యాప్ ద్వారా తక్కువ మొత్తాలు అందిస్తోందన్నారు.

షేక్ అబ్దుల్ బారీ అనే వ్యక్తి ఈ రుణ యాప్ ద్వారా రూ.10,500 తీసుకున్నాడని సిసి చౌహన్ తెలిపారు. ఈక్రమంలో అతని వాట్సప్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో మొబైల్ కాంటాక్టులు, గ్యాలరీలో ఉన్న ఫొటోలు.. నిర్వాహకులకు అందాయన్నారు. అంతే వాటి ద్వారా అతని ఫొటోలు మార్ఫింగ్ చేస్తామంటూ బెదిరించి, అతని వద్ద నుంచి దాదాపు రూ.2,50,000 కొల్లగొట్టారని చెప్పారు. బాధితుడి ఫిర్యాదుతో రుణయాప్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేశామని వెల్లడించారు. వారి వద్ద నుంచి మూడు లాప్‌టాప్‌లు, ఆరు సెల్‌ఫోన్లు, 18 సిమ్ కార్డులు,12 డెబిట్ కార్డులు, రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిపి చౌహాన్ వెల్లడించారు.

అప్రమత్తతే శ్రీరామరక్ష..
‘నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలి. ఫ్రెండ్ రిక్వెస్టులకు స్పందించవద్దు. బహుమతుల పేరిట ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ఇమెయిల్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించే వారిని నమ్మవద్దు. ఈ తరహా సంప్రదింపలు వచ్చినప్పుడు హెల్ప్‌లైన్ నెంబర్ 1930, www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయండ’ని సిపి చౌహాన్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News