Thursday, February 9, 2023

హైదరాబాద్ లో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్

- Advertisement -

హయత్ నగర్‌లో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
వీడియోలు తీసి బెదిరింపు
ఐదుగురు బాలుర అరెస్ట్.. పోక్సో చట్టం కింద కేసు నమోదు
నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్‌ల స్వాధీనం
అత్యాచారాలు… తరాలు మారినా, మానవ మేధస్సు ఎంత పెరిగినా, ఎన్ని సాధించినా, ఏమి చేసినా సభ్యతను మరచిన సామాజిక పోకడలకు దర్పణంగా నిలుస్తాయి. దిగజారిపోతున్న మానవ విలువలకు అద్దంపడుతూ కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంతమంది నేరస్తులకు జీవిత ఖైదులు, మరణ శిక్షలు విధించినా, అవేవి పట్టించుకోకుండా కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం అనేక చోట్ల చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. లైంగిక వేధింపులతో నరకం అనుభవిస్తున్నారు. మైనర్లు, మేజర్లు, ముసలివారు అన్న తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధుల సంఖ్య కూడా అలాగే పెరుగుతూ ఉంది. అత్యాచారం జరగని రోజు లేదు అన్న చందంగా పరిస్థితి ఉంది. తాజాగా హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఓ సామూహిక అత్యాచార ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది.

మన తెలంగాణ/హైదరాబాద్/హయత్‌నగర్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్ నగర్‌లో ఓ మైనర్ బాలికపైన జరిగిన సామూహిక అత్యాచార ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బాలికపైన జరిగిన అఘాయిత్యం తీరు, ఆ ఘటన బయటకు వచ్చిన విధానం విస్మయం కలిగిస్తోంది. బాలికను బెదిరించిన తీరు, ఆ ఘటన బయటకు వచ్చిన తీరు మొత్తం నాటకీయ పరిణామాల తరహాలో చోటు చేసుకున్నాయి. పదో తరగతి చదువుతున్న బాలురు ఈ అఘాయిత్యానికి పాల్పడిన తీరు కూడా వారి మానసిక స్థితి ఎంత క్రూరంగా ఉందో చాటుతోంది. ఈ అత్యాచార ఘటన గురించి పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాయత్ నగర్ లోని ఓ గవర్నమెంట్ స్కూలులో బాధిత బాలికతో పాటు, ఐదుగురు బాలురు పదో తరగతి చదువుతున్నారు. గత ఆగస్ట్ నెలలో 15వ తేదీన జెండా వందనం కార్యక్రమం తరవాత బాలిక వాష్ రూంకి వెళ్ళింది.

అదే సమయంలో తనని ఫాలో అయిన మిగతా ఐదుగురు బాలురు బాలికతో సున్నితంగా మాట్లాడుతూ అత్యాచారం చేశారు. ఘటన తర్వాత ఎవరితో అయిన చెబితే ఈ వీడియోని అందరికి చూపించడంతో పాటు సోషల్ మీడియాలో పెడతామంటూ భయ బ్రాంతులకు గురి చేశారు. దీంతో బాలిక ఎవరికి చెప్పకుండా ఉంది. ఘటన జరిగిన మరో 10 రోజుల తరువాత బెదిరించి బాలికపై మరోసారి బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. మళ్ళీ సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అయితే ఐదో బాలుడికి అవకాశం ఇవ్వలేదని కోపంతో ఆ వీడియోలను ఏకంగా 50 మందికి పంపాడు. అలా వైరల్ అయిన వీడియో బాధిత తల్లిదండ్రుల ఫోన్‌కి కూడా వచ్చింది. దీంతో బాలికను తల్లి నిలదీసి అడగగా బాలిక జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. న్యాయం కోసం స్థానిక కార్పొరేటర్ ను, పెద్దలను ఆశ్రయించినా ఫలితం దక్కకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, బాలికను బాలకల వసతి గృహంలో చేర్చారు.

దిగ్భ్రాంతి కలిగించేలా బాలుర మానసిక స్థితి
పదో తరగతి చదువుతున్న బాలురి దురాలోచనలు, మానసిక స్థితి ఈ స్థాయిలో ఉండడం చూసి పోలీసులు, ఈ ఘటన గురించి తెలిసిన వారు సైతం దిగ్భ్రమ చెందుతున్నారు. అంతటి క్రూరమైన ఆలోచనలు ఆ 15 ఏళ్ల వయసులో రావడం పట్ల పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆ ఐదుగురు బాలురు ఎప్పటి నుంచి స్నేహితులు, వారు కలిసి ఇంతకుముందు ఏమేం చేస్తుండేవారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా, ఐదో విద్యార్థి అంతటి అక్కసు పెంచుకొని, ఏమీ ఆలోచించకుండా అత్యంత సున్నితమైన ఆ వీడియోను 50 మందికి పంపేయడం కూడా పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితులపై క్రైం నెం..1266/2022, 449, 376 పోక్సో చట్టం-2012 లోని పలు సెక్షన్లు, ఐటి చట్టం-2000 ప్రకారం 67ఎ, 67బి కింద కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లు సీజ్ చేశారు.

Gang Rape on 10th Class Girl in Hayat Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles