Saturday, August 16, 2025

మానవత్వమా.. ఏదీ నీ చిరునామా?

- Advertisement -
- Advertisement -

గాజాలో పరిస్థితులు నరకం కంటే అధ్వానంగా మారాయని ఇటీవల రెడ్ క్రాస్ సంస్థకు చెందిన అంతర్జాతీయ కమిటీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి. ‘గాజా ప్రజలకు మనుషులుగా దక్కవలసిన కనీస గౌరవం కూడా లభించడం లేదు.. అది మనందరి మనస్సాక్షినీ కలచివేయాలి’ అంటూ ఆక్రోశించిన ఆమె, పాలస్తీనియన్ల కష్టాలకు ముగింపు పలికేందుకు, ఇజ్రాయెల్ బందీల విడుదలకు ప్రపంచ దేశాలు మరింతగా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. కానీ, జరుగుతున్నదేమిటి? గాజాలో ఏడాదిన్నరగా కొనసాగుతున్న నరమేధాన్ని కళ్లప్పగించి చూడటం తప్ప యుద్ధాన్ని ఆపేందుకు గానీ, విధ్వంసకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను కట్టడి చేసేందుకు గానీ ప్రపంచ దేశాలు చేపట్టిన చర్యలు శూన్యం. దరిమిలా, యుద్ధపిపాసిగా మారిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరింత పేట్రేగిపోతున్నారు.

గాజాను తుడిచిపెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన కొనసాగిస్తున్న జనహననానికి అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. యుగాలు మారినా, కాలాలు మారినా యుద్ధనీతి అనేది (Martial law) ఒకటి ఉంటుంది. శత్రువు వెన్నుచూపి పారిపోతున్నప్పుడు, చేతిలో ఆయుధం లేనప్పుడు, శరణుజొచ్చినవారిని చంపరాదనేది ఒకప్పటి నియమం. ఈ ఆధునిక కాలంలోనూ ఇలాంటివి లేకపోలేదు. ముఖ్యంగా యుద్ధసమయంలో పాటించవలసిన నియమ నిబంధనలను పేర్కొంటూ 1949 లో జెనీవా ఒప్పందం కొన్ని అదనపు సవరణలతో అమలులోకి వచ్చింది. యుద్ధసమయంలో పాటించవలసిన విధివిధానాలను ఈ ఒప్పందం విడమరచి చెబుతోంది. జనావాసాలపై దాడులు చేయకూడదని, చేతికి చిక్కిన శత్రువును చిత్రహింసల పాల్జేయరాదని, బందీలపై ఎలాంటి వైద్య, శాస్త్రపరమైన ప్రయోగాలు చేయరాదని… ఇలా ఎన్నో నిబంధనలు ఈ ఒప్పందంలో చోటుచేసుకున్నాయి. జెనీవా ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలన్నీ వీటిని తూచ తప్పకుండా పాటించవలసిందే.

కానీ, ఈ ఒప్పందంపై సంతకం చేసిన ఇజ్రాయెల్ మాత్రం వాటిని ఉద్దేశపూర్వకంగా కాలరాస్తోంది. గాజాలో ఆహారం కోసం సహాయ పంపిణీ కేంద్రాలవద్దకు వెళ్తున్న అన్నార్తులపై కాల్పులు జరిపి, 25 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడం ఇందుకు తాజా ఉదాహరణ. ఈ తరహా కాల్పులలో ఇప్పటికే వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలయ్యాక గాజాలో ఇప్పటివరకూ 70వేల మందికి పైగా కన్నుమూసినట్లు పత్రికలు, వార్తాప్రసార సాధనాలు ఘోషిస్తున్నాయి. ఇక, ఇజ్రాయెల్ దాడుల్లో క్షతగాత్రులైనవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ మానవతావాద సంస్థలు అందించే సహాయంపైనా నిన్నమొన్నటివరకూ ఆంక్షలు విధించిన ఇజ్రాయెల్, ఇప్పుడు కనికరించి, అందుకు సరేనన్నా, హెలికాప్టర్లలోంచి జారవిడుస్తున్న ఆహార పొట్లాలకోసం పరుగెడుతున్నవారిని కాల్చి చంపుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది.

నాలుగు రోజుల క్రితం గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిపై బాంబు దాడులు జరిపి, ప్రముఖ వార్తాసంస్థ అల్ జజీరాకు చెందిన నలుగురు జర్నలిస్టులను పొట్టనబెట్టుకుంది. పాత్రికేయుల ప్రాణాలు తీసినందుకు క్షమాపణ చెప్పవలసిందిపోయి, ఆ నలుగురిలో ఒకరు హమాస్ ఉగ్రవాది అంటూ బురదజల్లడం నెతన్యాహు ప్రభుత్వానికే చెల్లింది. పైపెచ్చు, హమాస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడం మినహా తమకు మరో మార్గం లేనందున దాడులు తీవ్రతరం చేశామని, ఈ విషయాన్ని అగ్రరాజ్యాధినేత ట్రంప్ మహాశయుడికి కూడా చేరవేశామన్న నెతన్యాహు ప్రకటనను గమనిస్తే, ట్రంప్ పచ్చజెండా ఊపిన పిమ్మటే అల్ జజీరా జర్నలిస్టులను ఇజ్రాయెల్ హతమార్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా అధినేత సాగిస్తున్న దమనకాండను పదేపదే ఖండిస్తున్న ట్రంప్, గాజాపై తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలపై నోరు మెదపకపోవడం శోచనీయం.

తాను అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందే రష్యా -ఉక్రెయిన్, ఇజ్రాయెల్- హమాస్ యుద్ధాలు ఆగిపోవాలని, లేదంటే ఊరుకోననీ బీరాలు పలికిన పెద్దమనిషి, ఈ ఏడు నెలలుగా చేసిందేమీ లేకపోగా నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కడం లేదని ఆక్రోశించడాన్ని చూసి ప్రజాస్వామికవాదులు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా ఒప్పందాలు, ఒడంబడికలు ఎన్ని కుదిరినా, వాటిని కాలరాచే దేశాలపై పకడ్బందీ చర్యలు లేనప్పుడు అవి వృథా అనే చెప్పాలి. జెనీవా ఒప్పందాన్ని పాటించకపోతే ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఇప్పుడు ఆ సంస్థే ఉత్సవ విగ్రహంగా మారింది. ఐక్యరాజ్య సమితి చేసే విజ్ఞాపనలకు, ఆదేశాలకు ఏమాత్రం విలువ లేదని తాజా యుద్ధాలు చెప్పకనే చెబుతున్నాయి. మరోవైపు సంక్షోభ సమయాలలో ప్రపంచ దేశాలకు పెద్దన్నగా నిలబడి, మధ్యవర్తిత్వం నెరిపే అమెరికా.. ట్రంప్ పగ్గాలు చేపట్టాక ఫక్తు వ్యాపార సంస్థగా మారిపోయింది. ఈ నేపథ్యంలో గాజావాసులకు దిక్కెవరు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News