న్యూఢిల్లీ: ఢిల్లీలోని మజ్నూ కా తిలా ఏరియాలో మంగళవారం 22 ఏళ్ల యువతితోపాటు ఆమె పసికందు హత్యకు గురయ్యారు. ఇద్దరి గొంతులు చీల్చి ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఇంటిలోంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన బయటపడింది. ఉత్తరాఖండ్‌కు చెందిన హతురాలు (22) తన భాగస్వామితో గొడవపడి అక్కడే రెండు బ్లాక్‌ల అవతల స్నేహితుని ఇంటిలో ఉంటుండగా ఈ హత్య జరిగిందని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో ఆమె తల్లి పెద్ద కుమార్తెను స్కూలు నుంచి తీసుకురావడానికి బయటకు వెళ్లింది. నిందితుడు ఇంటికివచ్చి యువతిని, పసికందును హత్య చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
పసికందు తండ్రి మొబైల్ షాపు నడుపుతుంటాడు. అయితే హత్య జరిగిన సమయంలో ఆయన కూడా పనికోసం బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ బృందం సంఘటన ప్రదేశానికి వెళ్లి హతులు ఇద్దరూ రక్తపు మడుగులో ఉండడం చూశారు. ఈలోగా ఒక లాడ్జిలో నిందితుడు ఉండడాన్ని గమనించి పట్టుకోడానికి వల పన్నారు. రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. సిసిటివి ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యలకు దారి తీసిన కారణాలేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.