Tuesday, April 23, 2024

బంగారం రూ.55 వేలకు చేరొచ్చు

- Advertisement -
- Advertisement -

Gold import duty raised to 15%

పసిడిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంచిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : ఇకపై వచ్చే పండుగల సీజన్లలో, పెళ్లిళ్లలో బంగారు ఆభరణాలను కొనుగోలు మరింత భారం కానుంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. పెరుగుతున్న బంగారం దిగుమతులను కట్టడి చేసేందుకు, అలాగే కరెంట్ ఖాతా లోటుకు చెక్ పెట్టేందుకు గాను కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త పన్ను జూన్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. దీని వల్ల దేశీయంగా బంగారం ధరలు మరింత పెరుగుతాయని, పది గ్రాముల పసిడి రూ.55 వేలకు చేరే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇంతకుముందు బంగారంపై సుంకం 7.5 శాతం ఉండగా, ఇప్పుడు ఇది 12.5 శాతానికి చేరింది. దీంతో పాటు 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ (ఎఐడిసి) ఉంటుంది. మొత్తంగా గోల్డ్ కస్టమ్ డ్యూటీ 15 శాతం అవుతుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్ ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయడం లేదని, అయితే పసిడిని ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్)పై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు.

బంగారం డిమాండ్ అస్థిరంగా ఉందని, అందువల్ల ప్రజలు దిగుమతి ఎక్కువగా చేసుకోకుండా ప్రయత్నిస్తున్నామని ఆమె అన్నారు. ఇప్పటికీ దిగుమతి చేసుకోవాలనుకుంటే ఇకపై మరింతగా దేశానికి పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుందని, ఇది ప్రభుత్వ ఆదాయానికి దోహదం చేస్తుందని ఆమె వివరించారు. బంగారం దిగుమతి అకస్మాత్తుగా పెరిగింది. మే నెలలో మొత్తం 107 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, జూన్‌లో కూడా గణనీయంగా దిగుమతి ఉంది. పసిడి దిగుమతులు పెరగడం వల్ల కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెరుగుతోందని ఆర్థికమంత్రి వివరించారు. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, దిగుమతులు ఖరుదు కావడంతో భారతదేశం విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి క్షీణత నుంచి కాపాడేందుకు విదేశీ మారక నిల్వలను వినియోగించింది. విదేశీ మారక నిల్వలు దాదాపు 40.94 బిలియన్ డాలర్లు తగ్గాయి.

రూ.1200 పెరిగిన బంగారం ధర

ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో శుక్రవారం నాడు బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌లో పది గ్రాముల పసిడి(22 క్యారెట్) ధర రూ.1200 పెరిగి రూ.47,850కి చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా 10 గ్రాముల ధర రూ.1200 పెరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, 10 గ్రాముల బంగారం ధర రూ.55,000 స్థాయికి వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. గురువారం ఎంసిఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.50,517 వద్ద ముగిసింది. కానీ శుక్రవారం బంగారం ధర రూ.1500 పెరిగి 10 గ్రాముల ధర రూ.52,000కి చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News