Wednesday, July 16, 2025

భూమిపై దిగిన శుభాంశు శుక్లా

- Advertisement -
- Advertisement -

భూమిపై దిగిన శుభాంశు శుక్లా
కాలిఫోర్నియా తీరం సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండింగ్
చిరునవ్వులు చిందిస్తూ బయటికి వచ్చిన నలుగురు సభ్యుల బృందం
అంతరిక్షంలో 18 రోజులు గడిపిన వ్యోమగాములు
మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు నిర్వహణ
యాక్సియం 4 మిషన్ విజయవంతం
న్యూయార్క్ : పద్దెనిమిది రోజుల అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా భూమిపైకి చేరుకుంది. దీంతో యాక్సియం4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.01 కి కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం4 కమాండర్ పెగ్గీ విట్సన్ పేర్కొన్నారు. డ్రాగన్ వ్యోమనౌక నుంచి చిరునవ్వులు చిందిస్తూ శుభాంశు శుక్లా, మిగతా ముగ్గురు వ్యోమగాములు ఆనందంతో చేతులు ఊపుకుంటూ బయటకు వచ్చారు. అంతరిక్షంలో గడిపిన తరువాత మొట్టమొదటిసారి తాజా గాలిని పీలుస్తూ ఆస్వాదించారు. ఈ నలుగురు వ్యోమగాములు వ్యోమనౌక నుంచి బయటకు రావడానికి స్పేస్ ఎక్స్ క్షేత్ర సిబ్బంది సహకరించారు. భూమి మీదకు దిగగానే రికవరీ షిప్ షానోన్‌లోకి చేరుకున్నారు. వారు నేలపైకి అడుగు పెట్టేలా యాక్సియం సిబ్బంది సహకరించారు. భూగురుత్వాకర్షణ శక్తికి మళ్లీ తమ అడుగులు సర్దుబాటు అయ్యేలా తప్పటడుగులు వేశారు. తీరానికి హెలికాప్టర్ ద్వారా రావడానికి ముందు వీరికి వైద్య పరీక్షలు జరిగాయి.

రోదసీలో 18 రోజులు గడిపి, మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను ఈ బృందం విజయవంతంగా నిర్వహించింది. మరోవైపు యాక్సియం4 మిషన్ విజయవంతం కావడంపై భారతీయుల్లో ఆనందం వ్యక్తమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్, స్లావోస్ట్ ఉజ్నాన్స్‌కీ విస్నియెస్కీ , టిబర్ కపులు ఈ బృందంలో ఉన్న సంగతి తెలిసిందే. జులై 13న ఐఎస్‌ఎస్ లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు, ముగిసిన తరువాత వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు, హల్వాను ఎన్నటికీ మరిచిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. ఇస్రో కు, తన సహచరులకు శుక్లా కృతజ్ఞతలు తెలిపారు. 18 రోజుల పాటు అనుకున్న ప్రయోగాలు పూర్తి చేసిన తరువాత డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ జులై 14న ఐఎస్‌ఎస్‌తో విడిపోయింది.

శుభాంశు కుటుంబం సంబురాలు..
తమ కుమారుడు శుక్లా బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సంతోషం వ్యక్తం చేశారు. భావోద్వేగానికి గురవుతూ ఆనందభాష్పాలు రాల్చారు. స్వస్థలం లక్నోలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

కోట్లాది మందికి స్ఫూర్తి: రాష్ట్రపతి, ప్రధాని
శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ యాక్సియం మిషన్ లో పాల్గొన్న ప్రతివ్యోమగామికి కృతజ్ఞతలు తెలియజేశారు. యాక్సియం మిషన్4 కు పైలట్‌గా నాయకత్వం వహించి భారత అంతరిక్షయాత్ర తోపాటు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అంతర్జాతీయ సహకారం లోను శుక్లా సాహస యాత్ర ఓ మైలురాయి సృష్టించిందని ముర్ము అభివర్ణించారు. శుభాంశు శుక్లా బృందం భూమికి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్‌ఎస్‌ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాంశు , పట్టుదల, అంకిత భావం, సాహస చర్యల ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ఎక్స్ వేదికగా కొనియాడారు. ఇది మన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. శుక్లాకు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సిఎంలు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ఏడు రోజులు క్వారంటైన్..
వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించనున్నట్టు ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జీరో గ్రావిటీలో గడిపిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారని వెల్లడించింది.

శుభాంశు రికార్డు ..
అంతరిక్షం లోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. 1984లో సోవియట్ యూనియన్ కు చెందిన ఇంటర్ కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ తొలిసారిగా అంతరిక్షం లోకి వెళ్లి ఎనిమిది రోజుల పాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏళ్ల తరువాత రోదసీ లోకి వెళ్లి వచ్చిన రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డు సృష్టించారు. ఐఎస్‌ఎస్ లోకి వెళ్లిన తొలి భారతీయుడు కూడా ఇతనే.

శుక్లా చేపట్టిన ఏడు ప్రయోగాలు
అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తరువాత శుక్లా ఈ 18 రోజుల వ్యవధిలో మొత్తం ఏడు ప్రయోగాలు నిర్వహించారు. ఈ ప్రయోగాలన్నీ భారత్ స్వదేశీయంగా రూపొందించిన సూక్ష్మ గురుత్వాకర్షణకు సంబంధించినవే. ఈ ప్రయోగాల్లో పెసర, మెంతుల విత్తనాలను మొలకెత్తించారు. మూలకణాలపై , సూక్ష్మ ఆల్గేపై పరిశోధనలు చేశారు. సున్నా గురుత్వాకర్షణ శక్తిలో నీటి బుడగను ప్రదర్శించారు. ఈ ఫ్లోటింగ్ బబుల్‌లో ఈ బృందం గడిపింది. మానవ జీర్ణ వ్యవస్థ ఖగోళంలో ఎలా పనిచేస్తుందనే అంశంపై విద్యార్థుల కోసం శుక్లా ఓ వీడియో రూపొందించారు. స్క్రీన్‌పై సంభాషించడం తోపాటు మెదడు పనితీరు సామర్థాన్ని తెలుసుకునే అభిజ్ఞా భార ప్రయోగాలు నిర్వహించారు.

అంతరిక్షంలో శుక్లా హెయిర్ కట్
అంతరిక్షకేంద్రంలో ఉన్నప్పుడు గురుత్వాకర్షణ లేని చోట శుక్లా హెయిర్‌కట్ చేయించుకున్నారు. శుక్లాకు అమెరికన్ వ్యోమగామి నికోల్ అయర్స్ హెయిర్‌స్టైల్ చేశారు. “ మా నలుగురు మిత్రులకు ఈ రోజు గుడ్‌బై చెప్పాం. గత వారాంతంలో మా వ్యోమగాములకు స్టైలింగ్ చేశాను, అది వారికి బాగుందని నా అభిప్రాయం. భూమి పైకి తిరిగి వచ్చాక నా హెయిర్ కట్ బిజినెస్ బాగా నడుస్తుందా ? అని మేమంతా జోక్ చేసుకున్నాం. అయితే వారు ఇంకా రివ్యూలు ఇవ్వలేదు” అని నికోల్ సరదాగా మాట్లాడారు. యూఎస్ ఎయిర్‌పోర్టులో ఆమె మేజర్‌గా ఉన్నారు. ఆరు గంటల పాటు స్పేస్‌వాక్ చేశారు. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు స్నానం చేయడానికి వీలు ఉండదు. వారికి షవర్లు, బాత్‌టబ్స్, స్పా వంటివేవీ ఉండవు. వెట్ టవల్స్‌తో శరీరాన్ని శుభ్రపర్చుకుంటారు. ఇదివరకు రోదసీ నుంచి పంపిన చిత్రాల్లో శుభాంశు గడ్డం కొంచెం పెరిగినట్టు కనిపించింది. తర్వాత క్లీన్‌షేవ్‌తో కనిపించారు. అక్కడ హెయిర్ స్టైలింగ్ చేయించుకున్న తొలి భారతీయుడు ఆయనే కావడం గమనార్హం. అమెచ్యూర్ రేడియో, వీడియో అనుసంధానం ద్వారా ప్రధాని మోడీతో, విద్యార్థులతో, ఇస్రో శాస్త్రవేత్తలతో శుక్లా సంభాషించావారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News