Saturday, April 13, 2024

ఆర్‌టిసి ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్‌టిసి ఉద్యోగుల పిఆర్‌సి కలను ప్రభుత్వం సాకారం చేసింది. 21 శాతం ఫిట్‌మెం ట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 53 వేల ఉద్యోగులకు మేలు కలుగుతుందని ఆయన వివరించారు. బస్సులు తగ్గిస్తున్నారంటూ కొందరు చేస్తున్న విమర్శలను పొన్నం ఖండించారు.బస్ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిట్‌మెంట్ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు. 2017లో నాటి ప్రభుత్వం 16 శాతం పిఆర్‌ఎసి ఇచ్చిందని, మళ్లీ ఇ వ్వలేదన్నా రు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుందని కానీ, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, సంస్థపై ఆర్థిక భారం పడుతు న్నా, ఉద్యోగుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఫిట్‌మెంట్‌ను అందజేస్తున్నామన్నారు. 21 శాతం ఫిట్‌మెంట్ పెంచడం వల్ల సంస్థపై నెల కు రూ.35 కోట్ల భారం, ఏడాదికి సంస్థ పై రూ.418.11 కోట్ల భారం పడుతుందన్నారు. కండక్టర్లకు, డ్రైవర్లకు, సూపర్ వైజర్లకు అందరికీ జీతం పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పే స్కేల్ – 2017 సర్వీస్‌లో ఉన్న 42,057 మంది ఉద్యోగులకు, 01-ఏప్రిల్- 2017 నుంచి పదవీ విరమణ చేసిన 11,014మంది ఉద్యోగులకు, మొత్తం 53,071 మంది ఉద్యోగులకు ఈ ఫిట్‌మెంట్‌తో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు.

సిఎం, డిప్యూటీ సిఎంకు కృతజ్ఞతలు
ఆర్‌టిసి ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందన్నారు. ఇప్పటివరకు 25 కోట్ల మంది మహిళలు ఆర్‌టిసి లో ఉచితంగా ప్రయాణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 21శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఆర్‌టిసి ఉద్యోగుల పిఆర్‌సి అంశాన్ని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రెండు రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 48 గంటలు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్‌టిసి ఉద్యోగులకు తీపి కబురు అందటంతో ఉద్యోగులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌టిసి కి కొత్తగా 2 వేల బస్సులు
ఆర్‌టిసిలో ఉన్న60 శాతం అక్యుపెన్సీ 100 శాతం దాటుతుందని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసిలో నూతన ఉద్యోగ నియమాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కొత్త మార్గంలో బస్సులు నడపాలని డిమాండ్స్ వస్తున్నాయన్నారు. ఆర్టీసికి కొత్తగా 2వేల బస్సులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఎక్కడ కూడా బస్సులు తగ్గించే పరిస్థితి ఉండదని ఆయన స్పష్టం చేశారు. సంస్థ ను ముందుకు తీసుకుపోవడనికి అందరం భాగస్వామ్యం కావాలన్నారు.
ఆర్‌టిసి విలీనంపై ప్రభుత్వం పరిశీలన
పెండింగ్ లో ఉన్న 280 కోట్ల బాండ్స్ ఇస్తామని నెక్లెస్ రోడ్డులో సిఎం, డిప్యూటీ సిఎంలు ప్రకటించారని, రెండు రోజుల్లో పేమెంట్ జరుగుతాయన్నారు. గతంలో ఆర్టీసిలో జరిగిన అనేక అంశాల వల్ల పిఎఫ్, సిసిఎస్‌లను వాడుకున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్‌టిసి ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ ఒరియంటేషన్‌కు వెళ్తుందన్నారు. ఉద్యోగులకు బోనస్ లు ఇతర బెనిఫిట్స్ ఇచ్చే విధంగా సంస్థను ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. ఆర్‌టిసి విలీనంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మంత్రి తెలిపారు.

సంస్థను బద్‌నామ్ చేయాలని చూస్తున్నారు…
ప్రభుత్వం మీద మంత్రి మీద కోపం ఉంటే వేరే పద్ధతిలో పొవాలని మంత్రి పొన్నం ప్రతిపక్షాలకు చురకలంటించారు. ఆర్టీసిపై విమర్శలను మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపు ఆర్‌టిసి లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. దానిని అమలు చేయడంలో ఆర్‌టిసి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రభుత్వం తరుపున వారికి మంత్రి అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తరువాత బస్సులు, బస్టాండ్ లు కళకళలాడుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైల్వేల మాదిరిగా ఆర్‌టిసి బస్సులు పని చేస్తున్నాయన్నారు. ఆర్‌టిసి ని బద్‌నామ్ చేయాలని చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఆర్‌టిసి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంటే ఆటో వాళ్లను రెచ్చగొడుతున్నారన్నారు.
వచ్చే 2 నెలల్లో 2వేలకు పైగా కొత్త బస్సులు: ఆర్‌టిసి ఎండి
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌టిసి ఎండి సజ్జనార్ కృతజ్ణతలు తెలిపారు. వచ్చే 2 నెలల్లో 2వేలకు పైగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. పిఆర్‌సి పెంపుతో తెలంగాణలో ఆర్‌టిసి ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News