Friday, April 26, 2024

ఆ ఇద్దరు గవర్నర్లు!

- Advertisement -
- Advertisement -

 

రాజ్‌భవన్‌లు రాజ్యాంగ బాట విడిచి ఇంతగా వీధిన పడడం బహుశా ఇదే మొదిటిసారి. కేంద్ర పాలకులను సంతోషపెట్టే క్రమంలో అవి రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల ప్రభుత్వాలను విసుగు, విరామం లేకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఇందులో తమిళనాడు, కేరళ గవర్నర్లు పరస్పరం పోటీ పడుతున్నారు. అది అత్యంత జుగుపాకర స్థాయికి దిగజారిపోయింది. దానితో అక్కడి ప్రజా ప్రభుత్వాలు వారిని తీవ్రంగా ప్రతిఘటించక తప్పని పరిస్థితి తలెత్తింది. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాజ్యాంగాన్ని కాపాడుతానని చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని ఆయనను తక్షణమే వెనక్కి (రీకాల్) రప్పించుకోవాలని, అక్కడి పాలక పార్టీ డిఎంకె, దాని మిత్ర పక్షాల ఎంపిలు రాష్ట్రపతికి వినతి పత్రం పంపించారంటే పరిస్థితి ఎంత వరకు వెళిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ విజ్ఞాపనను మన్నించి రాష్ట్రపతి ఈ గవర్నర్‌ను అక్కడి నుంచి తప్పించడం జరిగే పని కాదన్నది తెలిసిందే. అయినా ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను వద్దు పొమ్మని మొహం మీద గుద్ది చెప్పడం ఎంతటి తీవ్రమైన పరిణామమో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. తాము పంపిన 20 బిల్లులపై గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా తన వద్ద నిరవధికంగా వుంచుకోడాన్ని డిఎంకె ప్రభుత్వం ఎత్తి చూపింది. గవర్నర్ ప్రధాన బాధ్యత శాసన సభలో మెజారిటీని అనుభవిస్తున్న రాష్ట్ర మంత్రి వర్గ సిఫారసు మేరకు పని చేయడం. అది ఆయనపై రాజ్యాంగం వుంచిన ముఖ్య విధి. మిగతావన్నీ దీని తర్వాతనే. అందుకు విరుద్ధంగా తమకున్న ఇతర వెసులుబాట్లను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టాలని ఈ గవర్నర్లు నిర్ణయించుకొన్నారు.

అవి పంపించే బిల్లులను ఆమోదించకుండా వుంచుకోడం, విశ్వవిద్యాలయాల వ్యవహారాల్లో మితిమించి జోక్యం చేసుకోడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. తమిళనాడు గవర్నర్ భిన్న ప్రజా వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నారని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. గవర్నర్ ఒక బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపిస్తే రాష్ట్ర మంత్రి వర్గం మళ్ళీ దాన్ని ఆమోదానికి పంపవచ్చు. అప్పటికీ ఆమోదం లభించకపోతే అది దానంతటదే చట్టం అవుతుంది. గవర్నర్లు వాటిని నిరవధికంగా తమ వద్దనే వుంచుకొంటున్నారు. ఒక్కొక్కప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తూ వాటికి మోక్షం కలగకుండా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన పద్ధతి. తమిళనాడు గవర్నర్ తన వద్ద వుంచుకొన్న బిల్లుల్లో కీలకమైనవి వున్నాయి.

విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం కట్టబెడుతున్న బిల్లు, ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే బిల్లు వంటివి అందులో కొన్ని. అప్పటికే జారీ అయిన ఆర్డినెన్సుల స్థానంలో శాసన సభ ఆమోదించిన బిల్లులూ వున్నాయి. వీటిని ఎటూ తేల్చకుండా అస్పష్ట స్థితిలో కొనసాగించడం రాష్ట్ర ప్రభుత్వ బండి ముందుకు సాగకుండా చేయడమే కదా! కేరళ గవర్నర్ మరిన్ని మెట్లు పైకి వెళ్ళి ఒక రాష్ట్ర మంత్రిని తొలగించాలంటూ ముఖ్యమంత్రికి సిఫారసు చేసే వరకు సాహసించారు. దీనిని దుస్సాహసమే అనాలి. మంత్రులు ముఖ్యమంత్రి ఇష్టం మేరకే కొనసాగుతారు. యుజిసి నియమాలను పాటించనందుకు ఒక సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ను తొలగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆసరా చేసుకొని ఏకంగా రాష్ట్రంలోని తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లను అవ్యవధిగా రాజీనామా చేయవలసిందిగా కోరుతూ నోటీసులు పంపించారు.

దానితో ఆ విసిలు హైకోర్టును ఆశ్రయించడం, అది స్టే ఇవ్వడం జరిగిపోయింది. అందుచేత గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్‌ను విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకు రాడానికి కేరళ మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌ను కూడా అదే గవర్నర్ ఆమోదించవలసి వుంది. అది వేరే సంగతి. బిజెపియేతర పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాల గవర్నర్లు మాత్రమే ఇలా అడ్డంగా వ్యవహరించడంలోని ఆంతర్యం ఏమిటి? వారు తమంతతాముగా కాకుండా కేంద్ర పాలకుల జేబులో బొమ్మలుగా, వారి చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతున్నది.

వీలున్న చోట పాలక పక్షాల ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసి బిజెపి యేతర ప్రభుత్వాలను కూలగొట్టడం ఒక పద్ధతిగా ఎంచుకొన్న కేంద్ర పాలకులు అలా సాధ్యం కాని చోట రాజ్‌భవన్‌ల ద్వారా అక్కడి ప్రభుత్వాలను నానాయాతనలకు గురి చేయడం వీలైతే ఆ రాష్ట్రాల్లోని యూనివర్శిటీలకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యమున్న వారిని విసిలుగా నియమించడం అనే కుట్రకు పాల్పడుతున్నారు. రాజ్యాంగం మీద బొత్తిగా గౌరవం, విధేయత లేని వారి నుంచి ఇంతకంటే ఏమి ఆశించగలం?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News