Friday, September 13, 2024

కన్నీళ్ల పర్యంతరమైన రెజ్లర్ వినేశ్ ఫొగాట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరినా పతకం సాధించడంలో విఫలమైన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం స్వదేశం చేరుకుది. వినేశ్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. అభిమానులు, సహచర రెజ్లర్లు వినేశ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినేశ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కలచివేసింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వినేశ్‌కు కాంగ్రెస్ ఎంపి దీపిందర్ హుడా, రెజ్లర్లు సాక్షిమలిక్, బజరంగ్ పునియా తదితరులు ఓదార్చారు. అంతేగాక పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు.

వీరిని చూసిన వినేశ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా వినేశ్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్‌లో తనకు ఎదురైన పరిస్థితి మరేవరికి రాకూడదని తెలిపింది. ఫైనల్‌కు చేరినా తాను పతకం సాధించక పోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపింది. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని భావించినా అక్కడ కూడా నిరాశే మిగిలిందని వాపోయింది. రెజ్లింగ్‌లో ఉన్న కొన్ని నిబంధనలు ఆటగాళ్ల మనోభావాలను బాగా దెబ్బతీస్తున్నాయని, వీటిపై రెజ్లింగ్ సమాఖ్య దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా, ఒలింపిక్స్ మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.

అయితే ఫైనల్‌కు ముందు నిర్వహించిన కొలతల్లో వినేశ్ 100 గ్రాముల అధిక బరువు కలిగివున్నట్టు తేలింది. దీంతో నిర్వాహకులు వినేశ్‌పై అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు పడడంతో వినేశ్ పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయింది. తనపై వేసిన అనర్హత వేటును సవాల్ చేస్తూ వినే కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్)లో అప్పీల్ చేసింది. ఇక్కడ కూడా వినేశ్‌కు నిరాశే ఎదురైంది. వినేశ్ విజ్ఞప్తిని కాస్ కొట్టిపడేసింది. ఇదిలావుంటే స్వదేశం చేరిన వినేశ్‌కు అపూర్వ రీతిలో స్వాగతం లభించింది. దీపిందర్ హుడా, బజరంగ్ పునియా, సాక్షి మలిక్, సత్యవర్త్ కడియన్ తదితరులు వినేశ్‌పై ప్రశంసలు కురిపించారు. పతకం సాధించక పోయినా వినేశ్ అసలైన ఛాంపియన్ అని అభివర్ణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News