Thursday, April 18, 2024

గ్రూప్-1 మెయిన్స్ యథాతథం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో వదంతులు నమ్మొద్దని ఛైర్మన్ జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వదంతులకు అడ్డుకట్ట వేసేందుకే దురదృష్టకరమైన వాతావరణంలో మీడియా ముందుకు వచ్చామని అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో తమ కార్యాలయంలో నమ్మకంగా పనిచేస్తున్న ఉద్యోగులే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. మంగళవారం టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఛైర్మన్ స్పందించారు. కమిషన్‌లో నమ్మిన వాళ్లే గొంతు కోశారని వాపోయారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బంధీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో దాదాపు 30 లక్షల మంది అభ్యర్థులు వన్‌టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ విధానాన్ని యుపిఎస్‌సి, యుజిసి ఛైర్మన్ కూడా అభినందించిందని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎపిపిఎస్‌సి ఉన్నప్పుడు సగటున ఏడాదికి 4 వేల ఉద్యోగాలు భర్తీ చేసేవారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గతేడాది వరకు సుమారు 35 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది 26 నోటిఫికేషన్ల ద్వారా దాదాపు 23 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, దాంతో తమపై తీవ్రమైన పని ఒత్తిడి పెరిగిందని అన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం టిఎస్‌పిఎస్‌సిలో అనేక కొత్త విధానాలు అందుబాటులో తెచ్చామని చెప్పారు. ఇప్పటివరకు 26 నోటిఫికేషన్లు ఇవ్వగా, 7 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయని, 8వ పరీక్ష టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అని పేర్కొన్నారు. 175 పోస్టులకు దాదాపు 33 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షకు ఒక రోజు ముందు పేపర్ లీకైనట్టు సమాచారం వచ్చిందని అన్నారు. ఈ నెల 12న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. 11న తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. ఎవరో తమ కంప్యూటర్ల నుంచి సమాచారం హ్యాక్ చేసి దుర్వినియోగం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులు లీకేజీ కేసుపై చాలా వేగంగా స్పందించి, దాదాపు 48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారని అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీలో ప్రమేయం ఉన్న ఐదుగురి ఉద్యోగాలు పోతాయని స్పష్టం చేశారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, రేణుక భర్త ఉద్యోగాలు పోతాయన్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక వాస్తవం తెలుస్తుందని చెప్పారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా మల్టిపుల్ జంబ్లింగ్ విధానం

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మల్టిపుల్ జంబ్లింగ్ విధానం అమలు చేశామని టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ జనార్థన్‌రెడ్డి చెప్పారు.ఇది ఎంతో సవాళ్లతో కూడుకున్న విషయమని, అయినా చాలా రోజుల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈ విధానం అవలంబించామని వివరించారు. ప్రశ్నలతోపాటు జవాబులు మల్టిపుల్ జంబ్లింగ్ చేశామని చెప్పారు. ఈ విధానం అవలభించడం వల్ల పరీక్ష రాసే అభ్యర్థులు పక్కపక్కనే కూర్చున్నా వారి ప్రశ్నలు, సమాధానాలు వేరువేరుగా ఉంటాయని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేయగా, అక్టోబరు 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. 500 గ్రూప్ -1 పోస్టులకు దాదాపు 2.87లక్షల మంది రాశారని చెప్పారు. పరీక్ష ముగిసిన తర్వాత ఒఎంఆర్ షీట్‌తో పాటు, ప్రిలిమినరీ కీ ని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అన్నారు. ప్రిలిమినరీ కీ పై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, నిపుణులు కమిటీ తుది కీ రూపొందించిందని చెప్పారరు.

ఎట్టి పరిస్థితుల్లో అక్రమాలు జరగొద్దనే ఉద్ధేశంతోనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష అనేది స్కీనింగ్ టెస్టు మాత్రమే అని, , అందుకే మార్కులు ఇవ్వట్లేదని తెలిపారు. కేటగిరీలవారీగా, జోన్ల వారీగా మెయిన్స్‌కు అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని అన్నారు. అయితే కొన్ని కేటగిరీల వారికి తక్కువ మార్కులు వచ్చినా మెయిన్స్ ఎంపికవుతారని, ఎక్కువ మార్కులు వచ్చిన వారు వారిని చులకనగా చూడవద్దనే ఉద్దేశంతో కటాఫ్ ప్రకటించడం లేదని చెప్పారు. యుపిఎస్‌సి కూడా ప్రిలిమినరీ మార్కులు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ఛైర్మన్ గుర్తు చేశారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలనే ఉద్ధేశంతో పరీక్షల నిర్వహణలో సాధ్యమైనంత వరకు మానవ ప్రమేయాన్ని తగ్గించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

యథావిధిగా గ్రూప్-1 మెయిన్స్

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగతాయని ఛైర్మన్ వెల్లడించారు.జూన్ 5 నుంచి షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 మెయిన్స్‌నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంలో పోలీసులు అరెస్టయిన ప్రవీణ్‌కు గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే తాను మెయిన్స్‌కు అర్హత సాధించలేదని అన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో 103 మార్కులు అత్యధికం కాదని స్పష్టం చేశారు. గ్రూప్ 1 మెయిన్స్‌తోపాటు భవిష్యత్తులో జరగనున్న అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు మళ్లీ రూపొందిస్తామని అన్నారు. ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే వందల మంది మాత్రమే ఎంపికవుతారని, ఈ పరీక్షల్లో విజేతలు కాని వారిలో సహజంగానే అసంతృప్తి ఉంటుందని చెప్పారు. దాంతో వారు కోర్టులకు వెళ్లడం సాధారణమే అని పేర్కొన్నారు. తమ సమయం సగం కోర్టు కేసులకే సరిపోతుందని అన్నారు.

న్యాయనిపుణుల సలహా మేరకు నిర్ణయం..

రాజశేఖర్‌రెడ్డి అనే నెట్ వర్క్ నిపుణులు దాదాపు ఆరేడేళ్ల నుంచి టిఎస్‌పిఎస్‌స్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారని, అతనికి అన్ని కంప్యూటర్ల ఐపీ అడ్రస్లు తెలిసే అవకాశం ఉంటుందని జనార్ధన్‌రెడ్డి తెలిపారు. అతనికి ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో కీలక సమాచారం యాక్సిస్ చేసినట్టు తేలిందని చెప్పారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ దాన్ని దుర్వినియోగం చేసి రేణుక తదితరులకు ప్రశ్నపత్రాలు చేరవేశారని పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో 9 మంది నిందితులుగా తేలిందని, ప్రవీణ్ రూ.10లక్షలకు పేపర్లు అమ్ముకున్నాడని దర్యాప్తులో తేలిందని చెప్పారు. అసిస్టెంట్ ఇంజనీర్(ఎఇ) పరీక్షపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ పరీక్షపై ఇంకా నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై న్యాయ నిపుణులు సలహా తీసుకుని పరీక్ష రద్దు చేయాలా..? వద్దా..? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

నా పిల్లలు ఎవరూ గ్రూప్ -1 రాయలేదు

ప్రశ్నాపత్రం పేపర్ లీకేజీ వ్యవహారంలో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి వాపోయారు. తన పిల్లలు గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు తప్పుడు వార్తలను ట్రోల్ చేస్తున్నారని, అయితే తన పిల్లలు ఎవరూ కూడా గ్రూప్- 1 పరీక్ష రాయలేదని స్పష్టం చేశారు. వదంతులకు కూడా ఒక హద్దు ఉంటుందని అన్నారు.తాను పుట్టింది మహబూబ్‌నగర్‌లో, చదువుకున్నది రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అని చెప్పారు. ఉద్యోగ రిత్యా తాను ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నత స్థాయిలో చాలా ప్రాంతాల్లో పని చేశానన్నారు. తాను వివిధ ప్రాంతాలకు బదిలీ కావడం వల్ల తన పిల్లలు ఆయా ప్రాంతాలలో చదువుకున్నారని, దాంతో వారు నాన్ లోకల్ అయ్యారని చెప్పారు. తన ఇద్దరు పరీక్ష రాయలేదని, వాళ్లు రాస్తానంటే తాను టిఎస్‌పిఎస్‌సి పోస్టు నుంచి తప్పుకుంటానని చెప్పానని అన్నారు. తెలంగాణ పిల్లలకు న్యాయం చేసేందుకు ఈ పదవి తీసుకుని బాధ్యతగా పని చేస్తున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయడం కోసం తన కర్తవ్యాన్ని బాధ్యతగా నెరవేరుస్తున్నానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News