గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కాలువలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా గత 48 గంటల్లోనే 22 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు సంబంధించిన వివిధ సంఘటనలలో 18 మంది చనిపోయారు. బుధవారం బోటాడ్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎకో కారు నదిలో కొట్టుకుపోవడంతో నలుగురు మరణించగా.. ముగ్గురు గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) అధికారి తెలిపారు. ఇద్దరు ప్రయాణికులను రక్షించామని.. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన చెప్పారు.
సౌరాష్ట్ర, సమీప ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా భారీగా వరదలు సంభవించాయి. వరదల్లో పలువురు నివాసితులు కొట్టుకుపోతున్నట్లు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈక్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్తగా గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.