గురుకుల పాఠశాల విద్యార్థులపై వ్యాయామోపాధ్యాయుడు జులుం చూపించాడు. తన కర్కశత్వాన్ని వారిపై చూపి కర్రతో విచక్షణారహితంగా చితకబాదిన సంఘటన మెదక్ జిల్లా, కొండపాక మండలం, దుద్దెడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబధిత వ్యాయామ ఉపాధ్యాయుడు వాసుపై చర్యలు తీసుకోవాలని పైఅధికారులను కోరారు. వివరాల్లోకి వెళ్తే.. పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు క్లాసుకు కాస్త ఆలస్యంగా వచ్చారనే నెపంతో వ్యాయామ ఉపాధ్యాయుడు సుమారు 20 మందిని కర్రతో ఇష్ట్టారీతిగా కొట్టాడు. వీరిలో ముగ్గురు విష్ణువర్ధన్, అజయ్, గణేశ్ అనే విద్యార్థులను విచక్షణా
రహితంగా కర్రతో కొట్టడంతో వాతలు రావడంతో పాటు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ కృష్ణ మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా, పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై వెంటనే రాజన్న సిరిసిల్ల జోన్ గురుకుల పాఠశాలల జోనల్ ఆఫీసర్ ప్రత్యూష విచారణ చేపట్టారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులను వేర్వేరుగా విచారించారు. ఈ విచారణపై మీడియా వివరణ కోరగా పాఠశాలలో విద్యార్థులను పిడి కొట్టిన విషయం వాస్తవమేనని అన్నారు. విద్యార్థులకు తగిలిన గాయాలు హృదయవిదారంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి తదుపరి చర్యలకు రాష్ట్ర గురుకుల పాఠశాలల సెక్రటరీకి నివేదిక అందజేస్తామని అన్నారు.