Tuesday, November 12, 2024

రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు..ప్రజాపీడన:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 11 నెలల రేవంత్ రెడ్డి పాలన.. ప్రజాపాలన కాదు ప్రజాపీడన అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికి తామిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని, సిఎం వికృతరూపం బట్టబయలైందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా ధర్నాలతో అట్టుడికిపోతోందని చెప్పారు. ధర్నాలు చేస్తున్న వారిని చర్చలకు పిలవొచ్చు కదా..ఎందుకు చర్చలు జరపడం లేదని అడిగారు. నోటికొచ్చినట్టు మాట్లాడడం మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసు అని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని, హామీలు అమలు చేయమంటే నోటికొచ్చినట్టు తిడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంఎల్‌సిలు శంభీపూర్ రాజు,

దేశపతి శ్రీనివాస్,దేవిప్రసాద్ పల్లె రవికుమార్‌లతో హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, కొత్త హామీలు అమలు చేయకపోగా, కెసిఆర్ మానవీయ కోణంలో పేదలు, ప్రజల కోసం తెచ్చిన పథకాను సిఎం రేవంత్ రెడ్డి కొనసాగించలేకపోతున్నారని అన్నారు. బతుకమ్మ చీరలు ఒకటి కాదు రెండు ఇస్తామన్నారని, కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ.. రైతుల కోసం కెసిఆర్ రైతుబంధు అమలు చేశారని చెప్పారు. రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతుబంధు ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నారని, కానీ ఒక్క పంటకు కూడా రైతు బంధు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు కొనే దిక్కు లేదని ధ్వజమెత్తారు.

ఫాంహౌస్ ఘటన వెనుక రేవంత్ ప్రభుత్వ కుట్ర
ఫాంహౌస్ ఘటన వెనుక రేవంత్ ప్రభుత్వ కుట్ర ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. అది ఫాంహౌస్ కాదు.. రాజ్ పాకాల కొత్త ఇల్లు అని తేల్చిచెప్పారు. రేవ్ పార్టీ అని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని… అది రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్ అని స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో పిల్లలు, వృద్ధులు ఉంటారా అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే..కెటిఆర్‌పై బురద జల్లుతున్నారని విమర్శించారు. మూసీ విషయంలో పేదల పక్షాన పోరాడుతున్నందునే కెటిఆర్‌ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరదీశారని విమర్శించారు. వివిధ వర్గాల నుంచి వస్తోన్న వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి వణికిపోతున్నారని అన్నారు.

బండి సంజయ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనస్థాయికి తగ్గించుకుని మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తానా అంటే.. బండి సంజయ్ తందానా అంటున్నారని విమర్శించారు. బాధ్యత కలిగిన పదవీలో ఉండి బండి సంజయ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తరుఫున బండి సంజయ్ వకాల్తా పుచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా.. ఆర్‌ఎస్ బ్రదర్స్ ప్రభుత్వం నడుస్తోందా..? అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయమంత్రిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషం తప్ప… విజన్ లేదని ఎద్దేవా చేశారు. కెటిఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయటం మంచిది కాదని హెచ్చరించారు. హత్యా రాజకీయాలపై కాంగ్రెస్ ఎంఎల్‌సినే రోడ్డు మీదకొచ్చారని గుర్తుచేశారు. మూసీ విషయంలో నల్లగొండ రైతులతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులే రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రుణమాఫీపై ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి తనను బాడీ షేమింగ్ చేశారని ధ్వజమెత్తారు.

పోలీసుల మీదనే నిర్భందాలు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదే
పోలీసుల మీదనే నిర్భందాలు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే అని హరీశ్‌రావు విమర్శించారు. పండుగల సమయంలో రాష్ట్రంలో 144 సెక్షన్ విధించి ప్రజలు ప్రశాంతంగా షాపింగ్‌లు, పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేకుండా చేశారని అన్నారు. పోలీసులకు మూకలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు హక్కులు అడిగితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని అన్నారు. ఇప్పటికే 39 మంది పోలీసులను సస్పెండ్ చేయగా, 10 మందిని డిస్మిస్ చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా ఏక్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని, తమ సెలవులు రద్దు చేయవద్దని పోలీసులు కోరుతున్నారని అన్నారు. 11 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు తిరగబడుతున్నారన్నారని పేర్కొన్నారు. ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు కాదు.. అందులో 10 శాతం అంటే 20 వేల ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని హరీశ్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News