Sunday, October 6, 2024

రైతు ఏడ్చిన రాజ్యం..ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలో లేదు : హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్‌కు పిలుపునిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుట్టిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులను, రైతు సంఘాల నాయకులను ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తూ వారిపై కక్ష తీర్చుకుంటోందని ఆక్షేపించారు. రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతన్నలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని, దీనిని బిఆర్‌ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అరెస్టులు చేసిన రైతులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమది ఆంక్షలు లేని ప్రభుత్వం, కంచెలు లేని ప్రభుత్వం, ప్రజా పాలన అంటూ డబ్బా కొట్టుకునే రేవంత్ రెడ్డి ఇదేమిటని ప్రశ్నించారు.

ప్రజా భవన్ చుట్టూ ఎందుకు ఇన్ని బారికేడ్లు, ఎందుకు ఇన్ని ఆంక్షలని హరీశ్‌రావు అడిగారు. ప్రజాభవన్‌కు రైతులు తరలివస్తున్నారంటే సిఎంకు ఎందుకు అంత భయమని మండిపడ్డారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా మొదలైన రైతుల ఉద్యమాన్ని ఎదుర్కోవడం అంటే రాజకీయంగా వెకిలి మకిలి, చిల్లర వ్యాఖ్యలు చేసినంత సులువు కాదని అన్నారు. రుణమాఫీ ఏమైందని నిలదీసేందుకు వస్తున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఇప్పుడది ఆయనకు, ప్రభుత్వానికి ఉరితాడు కాబోతున్నదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేసి తీరే దాకా బిఆర్‌ఎస్ పార్టీ వదిలిపెట్టబోదని, తెలంగాణ రైతాంగం కూడా వదిలిపెట్టబోదని అన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం చరిత్రలో ఏనాడూ బాగుపడలేదని హరీశ్‌రావు గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News