Tuesday, October 15, 2024

రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్ధాలను వల్లెవేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారంవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రం దివాళా తీసిందని, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి పదేపదే మాట్లాడటం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమేనన్నారు. రూ.6.85 లక్షల కోట్ల అప్పుందనే తప్పుడు ప్రచారాన్ని ఇంకెన్నిసార్లు ..ఇంకెన్ని రోజులు సిఎం చేస్తారని ప్రశ్నించారు. పబ్ల్లిక్ మీటింగుల్లో, ప్రచార సభల్లో, 16వ ఆర్థిక సంఘం ముందు, చివరికి ప్రజాపాలన దినోత్సవం వేదికగా కూడా అదే తొండివాదన వినిపించడం వల్ల రాషా్ర్టనికి వచ్చే ప్రయోజనం ఏముందన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర అప్పుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలు వెల్లడించానని అన్నారు.

తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి మూలధన పెట్టుబడి, సంక్షేమాల కోసం నెట్‌గా చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమేనని అసెంబ్లీ వేదికగా ఆన్‌రికార్డ్ వివరించానని అన్నారు. తెచ్చిన అప్పులను మూలధనంగా మార్చి ఎన్ని అస్తులు సృష్టించామో ఎంత సంపద లెక్కలతో సహా చెప్పానన్నారు. అయినా రూ. 6.85 లక్షల కోట్ల అప్పు అంటూ దివాళా తీసిందంటూ రాష్ట్రానికి శాపం పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీసిందని ప్రచారం చేయడం ముఖ్యమంత్రిగా మీకు తగునా.. ఇది పాపం కాదా అన్నారు. కేవలం అప్పుల గురించి మాట్లాడతారు కానీ 9 యేండ్ల కాలంలో తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఎందుకు చెప్పరని అన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అనే విషయాన్ని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని ఎందుకు చెప్పరని అన్నారు. అప్పులను మూలధనంగా మార్చి తెలంగాణకు తరగని ఆస్తిని సృష్టించామన్న విషయాన్ని ఎందుకు చెప్పరని ఎద్దేవా చేశారు.

రాష్ట్రం దివాళా తీసిందన్న మీ మాటలు విని పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా? రాజకీయ కక్షల కోసం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారా? భావితరాలకు శిక్ష వేస్తారా అని అన్నారు. విదేశాలకు వెళ్లి ఇక్కడ డొల్ల కంపెనీల్లో బోగస్ పెట్టుబడులు పెట్టినంత సులువు కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మీ బాధ్యత లేని వ్యాఖ్యల వల్ల ఇప్పటికే పలు కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని అన్నారు. మీ అనాలోచిత చర్యల వల్ల రియల్ ఎస్టేట్ కుదేలైందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే తెలంగాణ మీ పాలనలో టాప్ పది స్థానంలో కూడా స్థానం దక్కించుకోలేకపోయిందని అన్నారు. దీనికి మీ దివాళకోరు వ్యాఖ్యలు చేతగాని తనం కారణమే కదా అని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు కోసం రాష్ట్ర ప్రయోజనాలు సైతం ఫణంగా పెట్టే గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్దిలో నడపమంటే చిల్లర మల్లర వాఖ్యలు చేయడం కాదని ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం కాదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంఎల్‌ఎ పద్మాదేవేందర్‌రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మాజీ చైర్మన్ బట్టి జగపతి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్ తదతరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News