Sunday, April 28, 2024

ఆరోగ్య తెలంగాణ కోసం ఒక్కో అడుగు ముందుకు పడుతుంది: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

నిమ్స్ చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా… ప్రముఖ ప్రభుత్వ దవాఖాన ‘నిమ్స్’ విస్తరణ పనులకు సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్వహించిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… ఆరోగ్య తెలంగాణ కోసం ఒక్కో అడుగు ముందుకు పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ వైద్య రంగంలో..ఇదొక విప్లవమని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉస్మానియా, గాంధీ తప్ప వేరేవి లేదని, వైద్యారోగ్య శాఖను మెరుగు పరచడం గత ప్రభుత్వాలు మర్చిపోయాయని విమర్శించారు. స్వరాష్ట్రంలో వైద్యారోగ్య శాఖను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కరోన లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తెలంగాణ వైద్యరంగం ఎదురుకోగలదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ యూజ్ డయాలసిస్ వసతలు ఇక్కడ ఉందని చెప్పారు.

గతంలో డాక్టర్ చదవాలంటే అందని ద్రాక్ష అని, తెలంగాణ బిడ్డలు ఉక్రెయిన్ లేదా మరెక్కడో వెళ్లి కష్టాలు పడకుండా అన్ని జిల్లాలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతీ లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, పిజి మెడికల్ సీట్లలో దేశంలో రెండోస్థానంలో ఉందని అన్నారు. తలసారి ఆదాయంలో, తలసారి విద్యుత్ వినియోగంలో, గ్రీన్ కవర్ పెంపుదలలో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని పేర్కొన్నారు. కెసిఆర్ నంబర్ వన్ కాబట్టి తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. బిపి, షుగర్‌లతో బాధపడేవారికి మందుల కిట్‌లు అందిస్తున్నామని, బిఆర్‌ఎస్ కిట్‌లు అందిస్తుంటే.. ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి తిట్లు తిడుతున్నారని మండిపడ్డారు. పల్లె దవాఖానాలు, బస్తీ ఖానాలు వచ్చిన తర్వాత.. ప్రజలకు ఆరోగ్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కంటి వెలుగును పంజాబ్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు అభినందిస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు మనం మోడల్‌గా మారామని చెప్పారు.

కెసిఆర్ పాలనలో కరెంట్ వెలుగులు, కంటి వెలుగులు అని, ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కందిళ్ల వెలుగులు అని విమర్శించారు. మావి న్యూట్రిషన్ పాలిటిక్స్…కొందరివి పార్టీషన్ పాలిటిక్స్ అని పేర్కొన్నారు. రోగమొస్తే బాగుచేయడమే కాదు.. రోగం రాకుండా ఆలోచించిన నాయకుడు సిఎం కెసిఆర్ అని పేర్కొన్నారు. కెసిఆర్ ముందుచూపుతో మిషన్ భగీరథను ప్రారంభించి.. రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ రహిత గ్రామంగా మార్చారని చెప్పారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా సీజనల్ వ్యాధులు రాకుండా తగ్గించుకోగలిగామని చెప్పారు. మారుమూలు గిరిజన గ్రామాల్లో, తండాల్లో కూడా అంటువ్యాధులు లేవని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాదు…ఎవరూ అడగని న్యూట్రిషన్ కిట్ల లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. హరితహారం ద్వారా కాలుష్య రహిత తెలంగాణను సాధించుకున్నామన్నారు. తెలంగాణ ఆచరిస్తోంది..దేశం అనుసరిస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News