Wednesday, April 24, 2024

బిజెపి వచ్చాకే దేశంలో విద్వేషం

- Advertisement -
- Advertisement -

ప్రజా సమస్యలు లేవనెత్తితే
అణచివేత ఎన్ని గంటలు
ప్రశ్నించినా ఈడీ, సిబిఐకి బెదిరేది
లేదు దేశంలో రైతుల పరిస్థితి
దారుణంగా మారింది ఢిల్లీ
రాం లీలా మైదానంలో కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ ధ్వజం

న్యూఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి దేశంలో విద్వేషం పెరిగిపోతోందని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, పార్లమెంటులో ప్రజా సమస్యలను లేవనెత్తే వారి గళాన్ని కేంద్రం అణచివేస్తోందని మండిపడ్డారు. మీడియా, ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర వ్యవస్థల పైనా ప్ర భుత్వం ఒత్తిడి పెరుగుతోందని, అటువంటివారిపైనా దాడులు చేస్తోందంటూ దుయ్యబట్టారు. ధ రల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ పెంపునకు నిరసనగా “మెహంగాయి పర్ హల్లా బోల్ ” పేరిట ఢిల్లీ లోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం నిర్వహించిన సభలో కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ దేశాన్ని వెనక్కు తీసుకెళ్తున్నారు. భయం, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఫలితంగా చైనా, పాకిస్థాన్‌లు వీటి నుంచి ప్రయోజనం పొందుతున్నాయి. బీజేపీలు, ఆరెస్సెస్‌లు దేశాన్ని విభజిస్తున్నాయి. ధరల పెరుగుదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, వారిని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలకు భరోసా కల్పించే కార్యక్రమాలు కరువయ్యాయి.

ముఖ్యంగా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. అందుకే వారు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐ సంస్థలను ఉసిగొల్పుతోంది. నన్నూ ఈడీ అధికారులు 55 గంటల పాటు వారి కార్యాలయంలో కూర్చోబెట్టారు. ఎన్ని గంటలు ప్రశ్నించినా ఈడీకి భయపడే ప్రసక్తే లేదు ” అని వ్యాఖ్యానించారు. యువతను వదిలేసి , ప్రభుత్వం కేవలం బడా వ్యాపారులకే ఉపాధి కల్పిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతుల కోసం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం … అవి కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యాపార వేత్తల ప్రయోజనాల కోసమేనని అన్నారు. కానీ రైతుల ఆందోళనలతో వెనక్కు తగ్గిందన్నారు. ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు, వారి మనసుల్లో ఏముందో అర్థం చేసుకునేందుకే “భారత్ జోడో” యాత్రను చేపడుతున్నట్టు వివరించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలే దేశాన్ని ప్రగతి పథంలో నడిపించగలవని అన్నారు.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మోడీ ప్రభుత్వానికి సోదరులు

మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రెండు సోదరులాంటివని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ధరల పెరుగుదల, అత్యవసర సరకులపై జిఎస్‌టి పెంపు, నిరుద్యోగం అంశాలపై కాంగ్రెస్ భారీ ర్యాలీకిముందు విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించడం లేదని జైరాం అన్నారు. ప్రభుత్వం ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లను ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జమ్ములో గులాం నబీ ఆజాద్ ర్యాలీ గురించి ప్రస్తావించగా, తాను కాంగ్రెస్ ర్యాలీ గురించి మాత్రమే మాట్లాడతానని… బీజేపీ ర్యాలీ గురించి కాదని వ్యాఖ్యానించారు.

పరోక్షంగా ఆజాద్‌ను బీజేపీ మద్దతుదారుగా అభివర్ణించారు. అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందన్న బీజేపీ ఆరోపణలపై జైరాం స్పందించారు. తాము ఈ ఆందోళనలను దాదాపు ఏడాది నుంచి నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఆగస్టు 5 న జైపూర్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించామని, దాదాపు 70 మంది ఎంపీలను విజయ్‌చౌక్ నుంచి అరెస్టు చేశారని తెలిపారు. పార్లమెంట్ బయట, వెలుపల నిరసన వ్యక్తం చేశామన్నారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఆందోళనలు నిర్వహించామన్నారు. ఇదే క్రమంలో సెప్టెంబరు 7 నుంచి భారత్ జోడో యాత్రను నిర్వహించనున్నట్టు తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తరహా లోనే ఈడీ, సీబిఐ కూడా మోడీ ప్రభుత్వానికి రెండు సోదరుల్లాంటివని ఆరోపించారు.

రాహులే అధ్యక్షుడు కావాలని నినాదాలు..

రామ్‌లీలామైదానంలో ఆదివారం ‘మెహంగాయి పర్ హల్లా బోల్ ’ పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు తరలివచ్చిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్ అంటూ సాగించిన నినాదాలు మిన్నుముట్టాయి. చాలామంది కార్యకర్తలు మరోసారి కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి రాహుల్ పార్టీ చీఫ్ కావాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. మా నిజమైన నేత రాహుల్‌జీ..ఆయనపై మాకు పూర్తి నమ్మకం ఉంది.కాంగ్రెస్ వైభవాన్ని ఆయన తిరిగి తీసుకొస్తారు. ఆయన పార్టీ చీఫ్ కావాలి అంటూ దీపేష్ సింగ్ డిమాండ్ చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ నుంచి ఆయన ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పొందిన తరువాత రాహుల్ తన పార్టీ ఉన్నత పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News