Friday, March 29, 2024

‘తడిసినా’.. ధాన్యం కొంటాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి విపత్తులు రైతుల వెన్ను విరుస్తున్నాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రాష్ట్రంలో యాసంగి పంటలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు , బలమైన ఈదరుగాలులతో కూడిన వండగండ్ల వానలు యాసంగి సీజన్‌లో వ్యవసాయరంగాన్ని కొలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షం వల్ల పలు జిల్లాల్లో చేతికందాల్సిన పంట చేజారిపోతొంది. వరి, మొక్కజోన్న,మిరప తదితర పైర్లు దెబ్బతింటున్నాయి. కోతదశకు వచ్చిన పైర్లతోపాటు , కోతలు పూర్తయి ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం రాసులు కూడా నిలువునా తడిసి ముద్దవుతున్నాయి. ఇటు ప్రభుత్వం ,అటు రైతులు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వారి కృషంతా ప్రకృతి వైపరిత్యాలముందు ఏటికి ఎదురీతలా మారుతోంది. అకాల వర్షాల వల్ల జరిగిన పంటనష్టాలపై అంచనాలు రూపొందించాలని ఆదివారం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి అందిన ప్రాధమిక సమాచారం మేరకు శనివారం కురిసిన వగగండ్ల వానలతో రాష్ట్రంలో సుమారు 30వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా వరి,మొక్కజొన్న పైర్లే దెబ్బతిన్నాయి.

అక్కడక్కడా ఉద్యాన పంటలకు కూడా నష్టం జరిగింది. కాపుమీద ఉన్న మామిడి తోటలు వడగండ్ల వానలతో వణికిపోయాయి. కాయలతోపాటు పిందెలు కూడా జల జన నేలరాలాయి. జనగామ జిల్లాలో బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లెలో ఏకంగా రెండు కిలోల బరువున్న వడగండ్లు పడ్డాయి. ఫిరంగి గుండ్లలా పడ్డ వడగండ్లు మామిడి తోటల్లో భీభత్సం సృష్టించాయి. వర్షం వెలిశాక తోటలవైపు పరుగులు తీసిన రైతులకు చెట్లకొమ్మలకు ఉండాల్సిన మామిడి కాయలు నేలపై రాలివున్న దశ్యాలు దర్శనమిచ్చాయి. ఏడాదంతా కష్టపడి పసిపిల్లాల్లా పెంచుకున్నమామిడి తోటల్లో నేలరాలిన పంటను చూసి రైతులు కంట తడిపెడుతూ భోరున విలపించారు. మహబూబాబాద్ జిల్లాల్లో భారీగా పంటనష్టం జరిగింది. ఈ జిల్లాలో వరి, మొక్కజొన్నతోపాటు ఇతర అన్ని పంటలు కలిపి సుమారు 11241 ఎకరాల్లో నష్టం జరిగినట్టు సమాచారం. పెద్దపల్లి జిల్లాలోని ఏడు మండలాల్లో 3631 ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 2350ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలో 1935ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది.

అకాల వర్షాల ప్రభావంతో నిర్మల్ జిల్లాలో 6550ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్ ,నల్లగొండ తదితర జిల్లాల్లో కూడా కోతదశకు వచ్చిన వరిపైర్లకు నష్టం వాటిల్లింది. రేపో మాపో వరికోతలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిద్దామనుకుంటున్న సమయంలో అకాల వర్షం పైరుమీదే ధాన్యం గింజలను నేలరాల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కోతకోసి కళ్లాల్లో గింజలు ఆరబెట్టుకున్న రైతులు సంచులకు ఎత్తుదామన్న దశలో ఆకస్మిక వర్షం ధాన్యం కుప్పలను తడిసి ముద్ద చేసింది. మార్కెట్లకు తెచ్చిన ధాన్యం కూడా ఒక్కసారిగా వచ్చిన గాలి వాన ధాటికి తడిసిపోయింది. సూర్యాపేట జల్లాలో జనగాంసూర్యాపేట జాతీయరహదారిపైన జాజిరెడ్డిగూడెం మండలం వేల్పుల వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. రాత్రి కురిసిన అకాల వర్షం వడగండ్ల వానకు పంటలు నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ణప్తి చేశారు. జాతీయరహదారిపై ట్రాఫిక్ జామ్ స్థంబించటంతో గంటసేపు వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

తడిసిన ధాన్యంపై రైతుకు ప్రభుత్వం భరోసా.. కొనుగోలుకు ఆదేశాలు

ముఖ్యమంత్రి కేసిఆర్ అదేశాలమేరకు పలువురు రాష్ట్రమంత్రులు తమ తమ జిల్లాల్లో పొలం బాట పట్టారు. ప్రకృతి వైపరిత్యాలు అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న గ్రామాలకు వెళ్లారు. నేరుగా పొలాల వద్దకే వెళ్లి పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చుతూ ,ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ ఆదివారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. చొప్పదండి, గంగాధర తదితర మండలాలతోపాటు కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. కాలికి గాయం అయినా లెక్కచేయకుండా వాకర్ సాయంతో పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు . అక్కడే ఉన్న రైతులను ఓదారుస్తు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు.

తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్‌కు ఆదేశాలు ఇచ్చామని మంత్రి గంగుల వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అకాల వర్షాలు పంటనష్టాలపై స్పందించారు. జనగామ జిల్లాలో పంటనష్టాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని , ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి రైతులకు తగిన పరిహారం అందేలా చూస్తామని వెల్లడించారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి పంటలు దెబ్బతిన్న పాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాలను అంచానా వేయాలని మంత్రి దయాకర్ రావు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News