11 మంది మృతి.. పలువురు గల్లంతు
మన తెలంగాణ/బాసర: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన నిర్మల్ జిల్లా, బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో శనివారం కూడా స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. గత నాలుగు రోజులుగా వర్షాలు విస్తారంగా కురవటంతో పాటు మహారాష్ట్రలో వర్షాలు భారీగా పడడం, అక్కడి ప్రాజెక్టులు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేయడంతో గత మూడు రోజులుగా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఆలయ పరిసరాల వరకే నీళ్లు చేరాయి. కానీ శనివారం వరద ఉద్ధృతి పెరగడంతో జ్ఞాన సరస్వతి ఆలయ ముందు ఉన్న వ్యాస మహర్షి ఆలయం వరకు, రెండవ ఆలయ ఆర్చి గేటు వరకు, ఇటు గోదావరి నుండి వందల గదుల భవనం వరకు భారీగా వరద నీరు చేరింది. నీటి ఉద్ధృతి పెరగటంతో స్థానికులు ఆందోళన చెందారు. గత మూడు రోజులుగా ఆలయ పరిసరాల్లో ఉన్న లాడ్జీలు, నివాస గృహాలు, ఆలయం ముందరున్న వ్యాపార దుకాణాలు నీట మునిగాయి. తాజాగా శనివారం మరింత ఉద్ధృతి పెరగడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి స్థానికులు మత్సకారుల సహకారంతో తెప్పలను ఉపయోగిస్తున్నారు.
భద్రాద్రి వద్ద నిలకడగా..
భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శనివారం మధ్యాహ్నం రెండో ప్రమాద హెచ్చరికకు ఒక అడుగు దూరం వరకు వచ్చి మళ్ళీ తగ్గుముఖం పట్టింది. రాత్రి 10 గంటలకు 47.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. తెల్లవారుజామున 4 గంటలకు 46.10 అడుగులకు చేరిన నీటి మట్టం ఉదయం 10 గంటలకు 47 అడుగులకు చేరింది. మధ్యాహ్నం 2 గంటలకు 47.30 అడుగులకు చేరి నిలకడగా మారింది. 48 అడుగులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. కానీ 47.30 వద్ద అగి ఆ తరువాత క్రమేపీ తగ్గుతూ వచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు 47.40 అడుగులకు కొనసాగి రాత్రి 7 గంటలకు 47.50 అడుగులకు చేరి, రాత్రి 10 గంటల వరకు అదే కొనసాగింది. 932 288 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.