Thursday, September 19, 2024

గరిష్ట స్థాయికి నాగార్జున సాగర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నదీపరివాహకంగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే కృష్ణా పరివాహకంగా ఉన్న ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్ జూరాల, శ్రీశైలం తదితర ప్రధాన ప్రాజెక్టులల్లో వరదనీరు తొణుకులు కొడుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటిమట్టాలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా శనివారం భారీగా వదర ప్రవాహం చేరుకుంటుంది. దీంతో ఈ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువవుతోంది. ఇదే ఊపులో ఎగువ నుంచి వరదనీరు రిజర్వాయర్‌లోకి చేరుకుంటే ఆదివారం నాగర్జునసాగర్ గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

ఆగస్టు మొదటి వారంలోనే కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండిపోవటంతో మహారాష్ట్ర, కర్ణాటక , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు గత నెల మూడవవారం లోనే నిండిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 3.13లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 2.75క్యూసెక్కుల నీటిని బయటకు వదిలిపెడుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో ఈ ప్రాజెక్టు నుంచి 2.56లక్షల క్యూసెక్కుల నీరు దిగువన జూరాలకు చేరుతోంది. జూలకు 2.90లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, బయటకు 2.70లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

మంత్రాలయం వద్ద ప్రమాదస్థాయిలో తుంగభద్ర:
కృష్ణాకు ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్ర నదిలో వరదనీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1.38లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటిమట్టం గిరష్ట స్థాయిలో ఉండటంతో ఈ ప్రాజెక్టు నుంచి దిగువకు 1.49లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన నదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. మంత్రాయలం వద్ద ప్రమాదహెచ్చరికను జారీ చేశారు. నదికి ఇరువైపులా తీరగ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సుంకేసుల బ్యారేజి వద్ద 1.67లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కేసికాలువకు 2800క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ మిగిలిన నీటిని వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వదిలిపెడుతున్నారు.

శ్రీశైలంకు 5.52లక్షల క్యూసెక్కుల వరద: ఇటు జూరాల అటు సుంకేసుల నుంచి కృష్ణా, తుంగభద్ర నదుల ద్వారా శ్రీశైలం జలాశయానికి భారీగా వదర ప్రవాహం చేరుతోంది. ఎగువ నుంచి 4.33 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 882అడుగుల వద్ద నీటినిలువ 202టిఎంలకు చేరింది. రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్‌ఆర్‌ఎంసికి 25000, హంద్రీనీవా కాలువకు 600, కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా 1600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు ప్రాజెక్టు పదిగేట్లు 20అడుగుల మేరకు ఎత్తివేశారు. ఎడమగట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 17.732మిలియన్‌యూనిట్లు, కుడిగట్టు కేంద్రం ద్వారా 14.159 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొత్తం 5,52,641క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.

సాగర్ గేట్లు ఎత్తివేతకు సిద్దం: ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడదలవుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ క్షణంలో నైనా నాగార్జున సాగర్ గేట్లను ఎత్తివేసేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు. శనివారం సాయంత్రం సాగర్ జలాశయంలోకి ఎగువ నుంచి 3,03,741క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ ప్రవాహం రోజుకు 50టిఎంసీలమేరకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 590అడుగుటు కాగా, ఇప్పటికే 565అగుగులకు చేరుకుంది. గరిష్టస్థాయి నీటినిలువ 312టిఎంసీలకు గాను ఇప్పటికే 244టిఎంసీలకు చేరింది.

ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా 39741క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో మరో 68టిఎంసీల మేరకు మాత్రమే ఖాళీ ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని వరద నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తూ మరో 50టిఎంసీల నీరు చేరగానే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దిగువన పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయినీటినిలువ సామర్దం 45టిఎంసీలు కాగా ప్రస్తుతం ఇందులో 3.69టిఎంసీల నీరు నిలువ ఉంది. సాగర్ నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తే ఒకేరోజులో పులిచింతల ప్రాజెక్టు నిండిపోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News