మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడ్రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్టు వాతావరణశాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు. తెలంగాణలో ఈ నెల 26వ తేదీ వరకు భారీవర్షాలు కురవనన్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురి సే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే అదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. హన్మకొండ, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
కాగా బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాల పల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే జూలై 24, 26 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో తేలిక పాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.